22 మంది సజీవ దహనం
ABN , Publish Date - Apr 20 , 2026 | 07:39 AM
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం కట్టనార్‌పట్టిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో...
తమిళనాడులో పెను విషాదం.. బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
రసాయనాలు కలుపుతుండగా ఘటన.. మంటల్లో కాలి బూడిదైన కార్మికులు
మరో ఏడుగురి పరిస్థితి విషమం
చెన్నై, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం కట్టనార్‌పట్టిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 22 మంది కార్మికులు దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు విరుదునగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. చాలా వరకు మంటల్లో కాలిపోవడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతా మారాయి. వివరాల ప్రకారం.. 10 గదులు ఉండే ‘వనజ ఫైర్ వర్క్స్’ బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం దాదాపు 100 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కార్మికులు బాణసంచాకు సంబంధించిన రసాయనాలను కలుపుతున్న సమయంలో మొదట ఓ గదిలో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మంటల ధాటికి పక్కన గదుల్లోని బాణసంచా కూడా పేలింది. దీంతో 10 కిలోమీటర్ల దూర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. బాణసంచా పేలుడుతో ఆరు గదులు నేలమట్టమయ్యాయి. అందులోని కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తొలి పేలుడు జరిగిన చాలాసేపటి వరకు టపాసులు పేలుతూనే ఉండడంతో.. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. పేలుడుకు గల కారణాలను అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, విరుదునగర్ జిల్లాలో తీవ్రమైన వేసవి వేడి పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాత్రి 8 గంటల సమయంలో సహాయక చర్యలు చేపడుతుండగా శిథిలాల కింద ఉన్న బాణసంచా పేలింది. దీంతో పలువురు అగ్నిమాపక సిబ్బంది గాయపడగా.. వారిని విరుదునగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలో భయానక దృశ్యాలు కనిపించాయి. పేలుడు ధాటికి ఆ సమయంలో అక్కడున్న కార్మికుల శరీరాలు తునాతునకలయ్యాయి. శిథిలాలను తొలగించే కొద్దీ వారి శరీర భాగాలు బయటపడ్డాయి. ఏది ఎవరి తలో, ఏది ఎవరి చెయ్యో అర్థం గాని పరిస్థితి నెలకొంది. గుర్తుపట్టలేనంతగా మారిన కార్మికుల మృతదేహాల భాగాలనే మూటల్లో కట్టి ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురు మహిళలు ఉండగా.. వారికి 60 శాతం వరకు కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. పేలుడు ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో