సీఎం విజయ్ ఓఎస్‌డీగా జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్
ABN , Publish Date - May 12 , 2026 | 03:07 PM
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రికి రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఇవాళ ప్రభుత్వం విడుదల చేసింది.
చెన్నై, మే 12: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రికి రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD - Political)గా నియమించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఇవాళ (మే 12, 2026) ప్రభుత్వం విడుదల చేసింది.
రాధన్ పండిట్ వెట్రివేల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో రాజకీయ సమన్వయం, అనుసంధానకర్తగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన విధుల్లో చేరిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. దాదాపు ఏడాది క్రితమే విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతారని రాధన్ పండిట్ జోస్యం చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో TVK (తమిళగ వెట్రి కజగం) 150కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని ఆయన అప్పట్లో అంచనా వేశారు.
విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయాన్ని కూడా రాధన్ పండిట్ సూచనల మేరకే మార్చినట్లు తెలుస్తోంది. తొలుత అనుకున్న సమయం కంటే ముందే (మే 10న ఉదయం 10 గంటలకు) శుభ ముహూర్తంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు.
రాధన్ పండిట్ గత నాలుగు దశాబ్దాలుగా వేద జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రంలో అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల (BJP, కాంగ్రెస్, DMK, AIADMK) నేతలతో సంబంధాలు ఉన్నాయని సమాచారం. ఈ నియామకం ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హేతువాద పునాదులున్న తమిళ రాజకీయాల్లో ఒక జ్యోతిష్యుడిని ప్రభుత్వ పదవిలో నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి...
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.. 24 గంటల్లోనే పూర్తి: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఇంద్రకీలాద్రిపై వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు
Read Latest AP News And Telugu News