రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం ఉంది
ABN , Publish Date - Jun 04 , 2026 | 06:27 AM
ఆన్‌లైన్ బెట్టింగ్‌ను, జూదాన్ని నిషేధిస్తూ కర్ణాటక, తమిళనాడు తీసుకొచ్చిన చట్టాలను సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో ఉన్న 2వ లిస్టులోని...
బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై నిషేధం విధించవచ్చు
నైపుణ్యం కలిగిన క్రీడలకే రాజ్యాంగపరమైన రక్షణ
ఆ క్రీడల మీద జరిపే బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లకు ఆ రక్షణ వర్తించదు
అవి డబ్బుతో కూడిన వ్యవహారాలు, వ్యసనాలు: సుప్రీంకోర్టు
కర్ణాటక, తమిళనాడుల్లో నిషేధాన్ని సమర్థించిన న్యాయస్థానం
ఆయా రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ, జూన్ 3: ఆన్‌లైన్ బెట్టింగ్‌ను, జూదాన్ని నిషేధిస్తూ కర్ణాటక, తమిళనాడు తీసుకొచ్చిన చట్టాలను సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో ఉన్న 2వ లిస్టులోని ఎంట్రీ 34 ప్రకారం బెట్టింగ్, జూదం (గ్యాంబ్లింగ్)పై నిషేధం విధించే, నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, ఈ మేరకు అవి చట్టం చేయవచ్చని తెలిపింది. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. బెట్టింగ్, జూదంపై కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో చట్టాలను సవరిస్తూ వాటి మీద నిషేధం విధించాయి. తద్వారా వాటికి పాల్పడేవారి మీద కఠిన చర్యలు తీసుకోవటానికి వీలుగా నిబంధనల్ని మార్చాయి. ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఆన్‌లైన్ బెట్టింగ్ కంపెనీలు ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో సవాల్ చేశాయి. నైపుణ్యం కలిగిన క్రీడలకు రాజ్యాంగపరమైన రక్షణ లభిస్తుందని, దానిని తమకు కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశాయి. దీనిపై అటు కర్ణాటక, ఇటు మద్రాస్ హైకోర్టులు సానుకూలంగా తీర్పులు ఇచ్చాయి. రమ్మీ, పోకర్ వంటి ఆన్‌లైన్ గేమ్‌లు నైపుణ్యంతో కూడినవేనని, వాటిని బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కింది పరిగణించలేమని పేర్కొన్నాయి. ఈ తీర్పులకు వ్యతిరేకంగా కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాయి. దీని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. నైపుణ్యంతో కూడిన క్రీడలకు ఆర్టికల్ 19 (1)(జీ) ప్రకారం రాజ్యాంగపరమైన రక్షణ లభిస్తుందని.. అయితే, ఆ క్రీడల మీద జరిపే బెట్టింగ్‌కు, జూదానికి ఆ రక్షణ లభించదని స్పష్టం చేసింది. అంతేగాక బెట్టింగ్, జూదం అనేవి భారీ డబ్బుతో కూడుకున్న వ్యవహారమని, అవి వ్యసనం వంటివని తెలిపింది. ఆర్టికల్ 19 ప్రకారం బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ల మీద వ్యాపారం చేసే ప్రాథమిక హక్కు తమకు ఉందని, దానిని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తెచ్చి తొలగించలేవన్న ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల వాదనను ధర్మాసనం తప్పుపట్టింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వ్యాపార సంస్థలకు ఆర్టికల్ 19 వర్తించదని తెలిపింది. ఈ మేరకు బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లను నిషేధిస్తూ తెచ్చిన చట్టాలను సమర్థించింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా మద్రాస్, కర్ణాటక హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి:
బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..