Share News

సీఈసీ సస్పెన్షన్ కోరుతూ పిటిషన్లు.. నేడు సుప్రీం కోర్టు విచారణ

ABN , Publish Date - Oct 05 , 2026 | 08:56 AM

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సస్పెన్షన్ కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

సీఈసీ సస్పెన్షన్ కోరుతూ పిటిషన్లు.. నేడు సుప్రీం కోర్టు విచారణ
Supreme Court to Hear Pleas Over CEC Gyanesh Kumar

ఇంటర్నెట్ డెస్క్: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సస్పెన్షన్ కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఇతర ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను పక్కనపెట్టి ఈసీలో ఏక పక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల సంఘంలో ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలన్న నిబంధనను సీఈసీ ఉల్లంఘించారా? అన్న కోణంలో కోర్టు పరిశీలించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. సీఈసీ, ఇతర అధికారులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ చేపట్టాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. ఏకాభిప్రాయం లేకుండా తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాలా బాగ్చీ, వి.మోహనల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది.


ఫారం-6లో మార్పులపై ప్రధానంగా పిటిషనర్లు అభ్యంతరాలు లేవనెత్తారు. ఎలక్టోరల్ రూల్స్‌లో మార్పులు చేయకుండానే ఓటర్ల నుంచి మునుపటి ఎస్ఐఆర్ వివరాలను కోరారని పేర్కొన్నారు. ఈ మార్పులపై ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారని కూడా పిటిషనర్లు పేర్కొన్నారు. ముగ్గురు కమిషనర్లు ఉన్న ఈసీలో మెజారిటీ అభిప్రాయానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు రాజ్యంగవిరుద్ధమంటూ కొట్టేయాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు.

ఇటీవల ఎస్ఐఆర్‌పై ఎన్నికల కమిషనర్లు సంధూ, జోషి పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు జాతీయ మీడియాలో వెలువడ్డ కథనాలతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే, ఈసీ మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేసింది. సాధారణ చర్చల్లో భాగంగా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం కావడం ఏ సంస్థలోనైనా సాధారణమేనని పేర్కొంది. ఈ క్రమంలో జారీ అయిన ఆదేశాలన్నీ పూర్తి చట్టబద్ధతతో తీసుకున్నవేనని పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

రాజకీయాల్లోకి సీబీఐ మాజీ చీఫ్‌ నాగేశ్వరరావు

చెన్నై ఎయిర్‌పోర్టులో 15 కోట్ల గంజాయి పట్టివేత

Updated Date - Oct 05 , 2026 | 09:08 AM