Share News

బెయిల్ పిటిషన్లు వేగంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

ABN , Publish Date - May 11 , 2026 | 01:02 PM

బెయిల్ పిటిషన్‌ల లిస్టింగ్, విచారణలో పదేపదే జరుగుతున్న ఆలస్యం, కేసులు భారీగా పేరుకుపోతుండటంపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

బెయిల్ పిటిషన్లు వేగంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
Supreme Court

న్యూఢిల్లీ, మే 11: హైకోర్టులలో బెయిల్ పిటిషన్లు వేగంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు పలు సలహాలు, సూచనలు చేసింది. బెయిల్ పిటిషన్‌ల లిస్టింగ్, విచారణలో పదేపదే జరుగుతున్న ఆలస్యం, కేసులు భారీగా పేరుకుపోతుండటంపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం సన్నీ చౌహాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణకు ముందే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టుల నుంచి పెండింగ్ బెయిల్ అప్లికేషన్స్‌ వివరాలను ధర్మాసనం తెప్పించుకుంది.


విచారణ సందర్భంగా.. వారం లేదా 15 రోజుల్లో బెయిల్ కేసులు విచారించాలని ధర్మాసనం హైకోర్టులను ఆదేశించింది. విచారణకు ముందే స్టేటస్‌ రిపోర్టులు తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. బెయిల్ దరఖాస్తు కాపీని ఏజీకి తప్పక అందజేయాలని సూచించింది. కొత్త బెయిల్ పిటిషన్లను వారంలోగా విచారణకు తీసుకోవాలని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న చాలా హైకోర్టులు సకాలంలో కేసుల పరిష్కారానికి ఇప్పటికే చొరవ తీసుకున్నాయని కూడా ధర్మసనం వెల్లడించింది.


అలహాబాద్ హైకోర్టు గురించి ప్రస్తావిస్తూ.. అక్కడి న్యాయమూర్తులు రోజుకు వందలాది కేసులను విచారిస్తున్నప్పటికీ ఇంకా చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఫోరెన్సిక్ నివేదికలు ఆలస్యం కావడం వల్ల బెయిల్ ప్రక్రియ ఆగిపోకూడదని, వాటిని సకాలంలో అందించేలా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ధర్మాసనం ఆదేశించింది. బెయిల్ విచారణ సమయంలో బాధితుల పక్షాన న్యాయవాదులు ఉండేలా.. వారి వాదనలు వినేలా తగిన యంత్రాంగాన్ని రూపొందించాలని సూచించింది.


ఇవి కూడా చదవండి

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిత్యానంద రెడ్డి

సూర్యకుమార్‌ నిర్ణయమే ముంబై ఇండియన్స్ కొంపముంచిందా?

Updated Date - May 11 , 2026 | 01:06 PM