వైద్య వృత్తికే తలవంపులు!
ABN , Publish Date - May 12 , 2026 | 06:01 AM
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పచ్చిపాల నమ్రత అలియాస్ అత్తలూరి నమ్రత వ్యవహారంపై సుప్రీంకోర్టు...
డాక్టర్ నమ్రత వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
రిమాండ్‌పై జోక్యానికి నిరాకరణ
న్యూఢిల్లీ, మే 11 (ఆంధ్రజ్యోతి): సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పచ్చిపాల నమ్రత అలియాస్ అత్తలూరి నమ్రత వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నమ్రత వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని వ్యాఖ్యానించింది. వృత్తి ధర్మాన్ని విస్మరించినందున నమ్రతకు ఉపశమనం కలిగించలేమని పేర్కొంది. తన అరెస్టు అక్రమమని, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ నమ్రత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో సరోగసి కుంభకోణానికి సంబంధించి 2024 జూలై 27న హైదరాబాద్‌లోని గోపాలపురం పోలీస్ ేస్టషన్‌లో మొదటిసారి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా ఒక శిశువును అప్పగించి, డాక్టర్ నమ్రత రూ.35 లక్షలు వసూలు చేశారని రాజస్థాన్‌కు చెందిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. డీఎన్‌ఏ టెస్ట్ చేయించగా.. ఆ బిడ్డకు, తమకు ఎటువంటి సంబంధం లేదని తేలిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిసా, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో ఇలానే నష్టపోయామని మరికొందరు పోలీసులను ఆశ్రయించారు. 15కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడంతో ఈడీ రంగంలోకి దిగింది. నమ్రతకు చెందిన రూ.30 కోట్ల ఆస్తులను గుర్తించి, ఎనిమిది బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. 2026 ఫిబ్రవరి 13న ఈడీ అధికారులు నమ్రతను అరెస్టు చేశారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో ఏప్రిల్ 28న ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
అధికారులు ఆర్టికల్ 22ను ఉల్లంఘించారు..!
నిందితురాలిని అరెస్టు చేసే సమయంలో అధికారులు ఆర్టికల్ 22ను ఉల్లంఘించారని నమ్రత తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. అరెస్టుకు కారణాలేమీ లిఖితపూర్వకంగా అందించలేదని చెప్పారు. కేసు డైరీ, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఎఫ్‌ఐఆర్ పత్రాలు వంటి కనీస ఆధారాలు సైతం మెజిరేస్టట్ ముందు ప్రవేశపెట్టలేదని, ఈ అరెస్టును చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. నిందితురాలు ఒక మహిళా డాక్టర్ అని, ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ అభ్యర్థనపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘ఆరోపణలు చిన్నవేమీ కాదు. ఆమె చేసిన పని ఏమాత్రం అభినందనీయం కాదు. ఇటువంటి చర్యలు ముమ్మాటికీ వైద్య వృత్తికి తలవంపులు తెచ్చేవే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈడీ అరెస్టు చేస్తే ట్రయల్ కోర్టులో ఎందుకు సవాల్ చేయలేదని ప్రశ్నించింది. నేరుగా సుప్రీంకోర్టు వరకూ రావడం సరైన న్యాయ ప్రక్రియ కాదని తెలిపింది. ఈ దశలో కేసు మెరిట్స్‌లోకి వెళ్లదలుచుకోలేదని, రిమాండ్ విషయంలోనూ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టులో.. హైకోర్టు చేసిన పరిశీలనల ప్రభావం ఉండకుండా చూడాలని విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం అంగీకరించింది. ఇదే విషయాన్ని తీర్పులో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్