హైకోర్టు న్యాయమూర్తితో సీనియర్ లాయర్ వాగ్వాదం.. సుప్రీం కోర్టు సీరియస్
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:49 PM
ఓ కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి ఝార్ఖండ్ హైకోర్టు న్యాయవాదిపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. మీరు ఏం చేయగలిగారని హైకోర్టును పరోక్షంగా ప్రశ్నించేందుకు లాయర్ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు ఉందని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కార నోటీసులను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సీనియర్ అడ్వొకేట్ మహేశ్ తివారీపై సర్వోన్నత న్యాయస్థానం తాజాగా సీరియస్ అయ్యింది. నన్నేమి చేయగలిగారని ఝార్ఖండ్ కోర్టుకు పరోక్షంగా చెప్పేందుకే మహేశ్ తివారీ ఈ పిటిషన్ వేసినట్టు ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ‘ఆయన క్షమాపణలు చెప్పాలంటే చెప్పుకోవచ్చు. అలా కాకుండా తన ధిక్కార స్వరాన్ని వినిపిద్దామనుకుంటే సరే.. మేము ఇక్కడే ఉన్నాం. అప్పుడు చెబుతాము’ అంటూ సీరియస్ అయ్యారు. అయితే, న్యాయవాది క్షమాపణలు చెప్పిన పక్షంలో వాటిని సహృదయంతో పరిగణించాలని ఝార్ఖండ్ హైకోర్టుకు కూడా సూచించారు ( SC on Mahesh Tiwari Contempt Case).
అసలేం జరిగిందంటే..
ఝార్ఖండ్‌కు చెందిన ఓ మహిళ రూ.1.30 లక్షల మేర విద్యుత్ బిల్లులు బాకీ పడ్డారు. దీంతో, విద్యుత్ కనెక్షన్‌ను అధికారులు కట్ చేశారు. ఈ వివాదం చివరకు హైకోర్టుకు చేరింది. మహిళ తరపున న్యాయవాది మహేశ్ తివారీ తన వాదనలు వినిపించారు. కనెక్షన్ పునరుద్ధరణ కోసం తన క్లైంట్ రూ.25 వేలు చెల్లించేందుకు సిద్ధమేనని మహేశ్ తివారీ కోర్టుకు తెలిపారు. అయితే, మునుపటి కోర్టు తీర్పుల ప్రకారం, బాకీలో కనీసం 50 శాతం చెల్లించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. చివరకు రూ.50 వేల చెల్లించేందుకు మహేశ్ తన క్లైంట్‌ను ఒప్పించడంతో వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.
అయితే, మహేశ్ తన వాదనలు వినిపించిన తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. మరో కేసుపై విచారణ ప్రారంభించే ముందు న్యాయమూర్తి మాట్లాడుతూ మహేశ్ వాదించిన తీరుపై దృష్టిసారించాలని అక్కడే ఉన్న ఝార్ఖండ్ హైకోర్టు బార్ కౌన్సిల్ ఛైర్మన్‌కు సూచించారు. దీంతో, మహేశ్ తివారీ బెంచ్ వద్దకు వచ్చి న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నేను నా శైలిలో వాదనలు వినిపిస్తాను. మీరు సూచించిన మేరకు కాదు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు.. ఏ లాయర్‌నూ అవమానించేలా కామెంట్స్ చేయొద్దు..’ అని అన్నారు. ‘కోర్టు అన్యాయం చేస్తోందని మీరు అనొచ్చా?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
అయితే, తాను అలా అనలేదని మహేశ్ తేల్చి చెప్పారు. కావాలంటే విచారణ రికార్డింగ్‌ను సమీక్షించొచ్చని తెలిపారు. మరో లాయర్ ఆ కామెంట్ చేశారని చెప్పారు. ‘ఒక్కసారి రికార్డు చూడండి యువర్ లార్డ్‌షిప్.. నేను అలా అనలేదు. నేను నా శైలిలో వాదనలు వినిపిస్తా. దయచేసి.. పరిధి దాటొద్దు! 40 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో ఉన్నా’ అని మహేశ్ తివారీ వాదించారు. దీంతో, ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది.
ఇవీ చదవండి:
భయమెరుగని నాయకత్వ పటిమకు నేతాజీ ప్రతీక: ప్రధాని మోదీ
బ్రెజిల్ ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని మోదీ