అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సిట్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు.. వచ్చే వారం విచారణ!
ABN , Publish Date - Jul 13 , 2026 | 01:47 PM
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఢిల్లీ, జులై 13: అయోధ్యలోని ప్రతిష్ఠాత్మక శ్రీరామ మందిరానికి భక్తులు సమర్పించిన నగదు, విలువైన వస్తువుల విరాళాల దుర్వినియోగం, చోరీ కేసు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సుప్రీంకోర్టు ఇవాళ (సోమవారం) ఆదేశించింది. కోర్టు పర్యవేక్షణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత ఈ కేసుపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను వచ్చే వారం విచారిస్తామని కోర్టు పేర్కొంది.
ట్రస్టుకు కూడా నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేయడాన్ని సాలిసిటర్ జనరల్ వ్యతిరేకించినప్పటికీ, ధర్మాసనం మాత్రం ట్రస్ట్‌కు కూడా నోటీసులు పంపడానికే మొగ్గు చూపింది. విచారణ బృందంలో ఎవరున్నారు? ఇప్పటివరకు దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చింది? అనే పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని యూపీ ప్రభుత్వ 'సిట్' ను ఆదేశించింది.
కోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు:
విచారణ సందర్భంగా సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. 'సిట్' దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. దీనిపై పిటిషనర్లు తమకు కూడా ఆ కాపీ కావాలని కోరగా, సాలిసిటర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు సీజేఐ స్పందిస్తూ.. 'మీకు చట్టం తెలుసు కదా.. ఎలాగైనా చివరికి వారు ఆ నివేదికను చూస్తారు' అని వ్యాఖ్యానించారు. అలాగే కోర్టులో గట్టిగా మాట్లాడుతున్న ఒక న్యాయవాదితో.. 'మీరు ఇక్కడ కేకలు వేయాల్సిన అవసరం లేదు, మీ గొంతును బయట వాడుకోవడానికి దాచుకోండి' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
అసలేంటి ఈ విరాళాల చోరీ వివాదం?
అయోధ్య రామాలయంలో భక్తులు కానుకలుగా సమర్పించిన భారీ మొత్తంలో నగదు, ఇతర విలువైన వస్తువులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు రావడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ఆరోపణలపై విచారణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ అధ్యక్షతన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. 'సిట్' తన ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. జులై 1న దర్యాప్తును పూర్తిగా ముగించడం కోసం యూపీ ప్రభుత్వం 'సిట్' గడువును మరో 15 రోజులు పొడిగించింది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. విరాళాల నిర్వహణ వ్యవస్థను, దానికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడానికి 'సిట్' బృందం మరోసారి అయోధ్యను సందర్శించనుంది. ఇందులో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెందిన నిర్వాహకులను, ఆలయ నిధుల నిర్వహణతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను కూడా దర్యాప్తు బృందం ప్రశ్నించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉన్నందున, ఇప్పటివరకు జరిగిన పురోగతిని పరిశీలించిన తర్వాతే తాము తదుపరి ఉపశమనాలు లేదా సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్