Share News

గృహిణుల శ్రమ విలువ నెలకు 30 వేల కన్నా ఎక్కువే

ABN , Publish Date - Jun 12 , 2026 | 06:21 AM

గృహిణులను దేశ నిర్మాతలుగా గుర్తించాలని.. ఒకవేళ ఆమె అందించే గృహ సంరక్షణ సేవలను నష్టపోతే ద్రవ్య రూపంలో కనీ సం నెలకు రూ.30 వేలుగా లెక్కగట్టాలని సుప్రీంకోర్టు...

గృహిణుల శ్రమ విలువ నెలకు 30 వేల కన్నా ఎక్కువే

  • వారే దేశ నిర్మాతలు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, జూన్‌ 11: గృహిణులను దేశ నిర్మాతలుగా గుర్తించాలని.. ఒకవేళ ఆమె అందించే గృహ సంరక్షణ సేవలను నష్టపోతే ద్రవ్య రూపంలో కనీ సం నెలకు రూ.30 వేలుగా లెక్కగట్టాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇంట్లో ఉండే గృహిణులు సంపాదించే వారిపై ఆధారపడి బతుకుతారనుకోవడం ముమ్మూటికీ తప్పేనని స్పష్టం చేసింది. ఓ రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయిన వ్యక్తి తమ కు నష్ట పరిహారాన్ని పెంచాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. గృహిణులు ఇంటి పనిచేస్తూ, కుటుంబ సభ్యులు, పిల్లలను చూసుకుంటూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని కోర్టు పేర్కొంది. ‘సాధారణంగా గృహిణులు సంపాదించే భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులపై ఆధారపడతారని సమాజం అనుకుంటుంది. కానీ.. వాస్తవానికి ఇల్లు సజావుగా నడవడం ఆమెపైనేఆధారపడి ఉంటుంది. అసలు దేశ నిర్మాతలే వారు. జీతం లేకుండా మహిళలు చేసే ఇంటి పనులు దేశ జీడీపీలో 15-17ు వాటాకు సమానమనే అంచనాలున్నాయి’ అని తెలిపింది. గృహిణి అందించే గృహ సంరక్షణ, సేవలకు నెలకు కనీసం రూ.30 వేలుగా పరిగణించి నష్ట పరిహారాన్ని లెక్కించాలని ఈ సందర్భంగా ఆదేశించింది. పంజాబ్‌కు చెందిన ఓ మహిళ 2001లో ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీనిపై ఆమె భర్త, ముగ్గురు పిల్లలు మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా.. రూ.2.42 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాత పంజాబ్‌-హరియాణ హైకోర్టుకు వెళ్లగా.. పరిహారాన్ని రూ.8.43 లక్షలకు పెంచింది. అయినా తమకు న్యాయం జరగలేదని బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 06:21 AM