లా విద్యార్థులను బీసీఐ నియంత్రించలేదు
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:32 AM
లా విద్యార్థుల ప్రవర్తనను నియంత్రించే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ)కుగానీ, రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకుగానీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ విద్యార్థులు చదువుతున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు మాత్రమే ఆ అధికారం ఉంటుందని తేల్చిచెప్పింది
రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు కూడా ఆ అధికారం లేదు..
నల్సార్ విద్యార్ధులపై బీసీఐ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసిన సుప్రీంకోర్టు
అడ్వకేట్‌గా నమోదైన తర్వాతే వాటి పరిధిలోకి
లా విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు
ఆయా విద్యాసంస్థలే తీసుకోగలవు
నల్సార్ విద్యార్థులపై బీసీఐ జారీ చేసిన ఉత్తర్వులకు చట్టబద్ధత లేదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): లా విద్యార్థుల ప్రవర్తనను నియంత్రించే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ)కుగానీ, రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకుగానీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ విద్యార్థులు చదువుతున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు మాత్రమే ఆ అధికారం ఉంటుందని తేల్చిచెప్పిందినల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను ఆహ్వానించవద్దంటూ ఆ వర్సిటీ విద్యార్థులు వీసీకి లేఖ రాయటం, ఈ నేపథ్యంలో నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేసుకోవద్దంటూ బీసీఐ చెయిర్ పర్సన్ మనన్‌కుమార్‌మిశ్రా బార్ కౌన్సిళ్లకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఉత్తర్వుల మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో వాటిని కొద్దిసేపట్లోనే బీసీఐ ఉపసంహరించుకుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ నల్సార్ పూర్వ విద్యార్థులు కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. న్యాయవాదుల చట్టం, 1961కింద బీసీఐ ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేస్తూ, లా విద్యార్థుల మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలైనా తీసుకునే అధికారం ఈ చట్టం కింద బీసీఐకిగానీ, రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకుగానీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. లా విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసి, అడ్వకేట్లుగా నమోదు చేసుకున్న తర్వాతే వారి మీద బీసీఐకి, బార్ కౌన్సిళ్లకు నియంత్రణాధికారం ఉంటుందని తెలిపింది. లా విద్యార్థులకు సంబంధించి ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే.. ఆ అధికారం వారు చదువుతున్న విద్యాసంస్థకు మాత్రమే, అది కూడా ఆ సంస్థ నియమ నిబంధనలకు లోబడి ఉంటుందని పేర్కొంది.
తద్వారా ఆగస్టు 13వ తేదీన బీసీఐ జారీ చేసిన ఉత్తర్వులు, ఆ తర్వాత మళ్లీ వెలువరించిన సవరించిన ఉత్తర్వులకు ఎటువంటి చట్టబద్ధత లేదని ప్రకటించింది. వాటిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ, అది హద్దులు దాటకూడదని హితవు పలికింది. కాగా, విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కే పరమేశ్వర్ వాదనలు వినిపిస్తూ.. ఉత్తర్వులను బీసీఐ ఉపసంహరించుకున్నప్పటికీ, ఆ సంస్థ వ్యవహరించిన తీరుపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీఐ తరఫున చెయిర్ పర్సన్ మనన్‌కుమార్ మిశ్రా వాదనలు వినిపించారు. ఇది ముగిసిపోయిన వ్యవహారమని, ఉత్తర్వులను వెలువరించిన వెంటనే వాటిని ఉపసంహరించుకున్నామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ, కేసును ముగిస్తున్నట్లు తెలిపింది.
నేనూ ఉద్యమాల్లో పాల్గొన్నా
విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విద్యార్థులు అడ్వకేట్లుగా నమోదు చేసుకున్న తర్వాతే వారిపై బీసీఐకి నియంత్రణ ఉంటుంది. అంతవరకు విద్యా ప్రమాణాలను నిర్దేశించడానికే బీసీఐ పరిమితం కావాలి తప్ప, విద్యార్థులపై నేరుగా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. నా విద్యార్థి దశలో నేనూ చురుగ్గా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నా. విద్యార్థుల అభిప్రాయం తప్పైనా సరే, నిరసన తెలిపే హక్కు వారికి ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇదివరకు ఈ అంశం ధర్మాసనం ఎదుట ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా.. ‘ఇది నాకూ విద్యార్థులకు మధ్య జరిగే సంభాషణ. దీంట్లో జోక్యం చేసుకోవడానికి బీసీఐ ఎవరు అని సీజేఐ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోని ఆడడు: సీఎస్కే మాజీ ప్లేయర్
వాళ్లు ఓడలేదా ?... భారత్‌పై పీసీబీ చీఫ్ నఖ్వీ అక్కసు