‘వాట్సాప్ యూనివర్సిటీ’ సమాచారాన్ని స్వీకరించలేం
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:41 AM
ప్రముఖ రచయితలు, మేధావులందరి అభిప్రాయాలను గౌరవిస్తామని, అయితే వాట్సాప్ యూనివర్సిటీ (ధ్రువీకరించని సోషల్ మీడియా పోస్టుల) సమాచారాన్ని...
శబరిమల కేసులో జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రముఖ రచయితలు, మేధావులందరి అభిప్రాయాలను గౌరవిస్తామని, అయితే వాట్సాప్ యూనివర్సిటీ (ధ్రువీకరించని సోషల్ మీడియా పోస్టుల) సమాచారాన్ని స్వీకరించలేమంటూ శబరిమల కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానం ఏ మూలం నుంచి వచ్చినా స్వీకరిస్తామని.. కానీ సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపించే తప్పుడు సమాచారంపై కోర్టు ఆధారపడదని పేర్కొన్నారు. శబరిమల ఆలయం సహా ప్రార్థనా స్థలాల్లో మహిళ పట్ల వివక్షకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దావూదీ బోహ్రా కమ్యూనిటీ అధ్యక్షుడి తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపించారు. మతపర ఉపశమన విషయాల్లో న్యాయపరమైన సంయమనం గురించి కాంగ్రెస్ నేత శశిథరూర్ రాసిన ఓ వ్యాసం గురించి ప్రస్తావించారు. దీనిపై సీజేఐ జోక్యం చేసుకుంటూ.. ‘ప్రముఖులు, న్యాయ నిపుణుల వంటి అందరి అభిప్రాయాలను గౌరవిస్తాం. అయితే వాటిని వ్యక్తిగతమైనవిగానే పరిగణిస్తాం’ అని చెప్పారు. ‘జ్ఞానం, వివేకం ఏ మూలం నుంచి వచ్చినా, ఏ దేశం, ఏ విశ్వవిద్యాలయం నుంచి వచ్చినా దాన్ని స్వీకరించాలి. అదే మన గొప్ప నాగరికత’ అంటూ కౌల్ వ్యాఖ్యానించారు. దీనిపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. ‘కానీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి కాదుగా..’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి