ఆ 600 ఎకరాలు రక్షిత అడవే
ABN , Publish Date - May 07 , 2026 | 07:15 AM
ఒక భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదైనంత మాత్రాన ఆ భూమిపై సదరు వ్యక్తికి యాజమాన్య హక్కులు సంక్రమించవని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది...
రెవెన్యూ రికార్డులు హక్కు పత్రాలు కావు
రికార్డుల్లో ‘జంగిల్’ అని ఉంటే అది అటవీ శాఖదే..
భద్రాద్రి జిల్లా కల్వల నాగారం భూమిపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
దశాబ్దాల నాటి భూ వివాదానికి తెరదించిన న్యాయస్థానం
న్యూఢిల్లీ, మే 6 (ఆంధ్రజ్యోతి): ఒక భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదైనంత మాత్రాన ఆ భూమిపై సదరు వ్యక్తికి యాజమాన్య హక్కులు సంక్రమించవని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెవెన్యూ రికార్డుల పరిమితిని విస్పష్టంగా నిర్దేశించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండ లం కల్వలనాగారం గ్రామంలో సర్వే నంబరు 81లోని 600 ఎకరాల భూమిపై దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి తెరదించింది. ఈ భూముల పరిరక్షణ విషయంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థి స్తూ, ప్రైవేటు వ్యక్తుల వాదనను తోసిపుచ్చింది. కల్వల నాగారంలోని సర్వే నంబర్ 81లో ఉన్న 787 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారె్‌స్టగా పేర్కొం టూ 1950 ఫిబ్రవరి 6న గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే, అందులో 600 ఎకరాలపై తమకు హక్కులు ఉన్నాయని, 1931-32లో అప్పటి నిజాం నవాబు తమకు పట్టాలు ఇచ్చారని వడియాల ప్రభాకర్ రావుతోపాటు మరో 8 మంది హక్కులు కోరుతూ వచ్చారు. వారి వాదనను 2003 మే 19న జాయింట్ కలెక్టర్ తోసిపుచ్చారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వారు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. 2012లో సింగిల్ జడ్జి వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో ప్రభాకర్ రావు తదితరులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పిటిషన్‌పై సుధీర్ఘ వాదనల అనంతరం బుధవారం జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్.వీ.ఎన్. భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ప్రకటించింది. పహాణీలు, ఫైసల్ పట్టీ లాంటి రెవెన్యూ రికార్డులు కేవలం పన్నుల వసూళ్ల కోసమేనని, వాటిలో పేరు ఉన్నంత మాత్రాన భూమిపై యాజమాన్య హక్కులు దక్కవని స్పష్టం చేసింది. పిటిషనర్లు అసలైన పట్టా పత్రాలను సమర్పించటంలో విఫలమయ్యారని పేర్కొంది. ఇప్పటికే 75 ఏళ్లు గడిచిపోయాయని, లేని ఆధారాల కోసం ఇంకెంతకాలం కేసును సాగదీస్తారని పిటిషనర్లపై అసహనం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి..
విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ