Share News

సీఈసీ నియామక చట్టంపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

ABN , Publish Date - Jul 30 , 2026 | 07:51 PM

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) నియామకానికి సంబంధించి 2023లో తెచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.

సీఈసీ నియామక చట్టంపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
Supreme Court

ఇంటర్నెట్ డెస్క్: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) నియామకానికి సంబంధించి 2023లో తెచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి పంపించాలా? వద్దా? అన్న అంశంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. సీఈసీ నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తికి (సీజేఐ) స్థానం లేకపోవడంపై అభ్యంతరం తెలుపుతూ పలువురు ఈ పిటిషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.


సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాల కమిటీలో సీజేఐ తొలగింపును కేంద్రం సమర్థించుకుంది. సీఈసీ నియామకానికి సంబంధించి నూతన చట్టంతో ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తి దెబ్బతినదని సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రధాని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారని ముందే భావించడం తప్పు అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆర్టికల్ 324(2) ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకాలపై చట్టం చేసే అధికారం పార్లమెంట్‌కు ఉందని కేంద్రం తెలిపింది. నియామక కమిటీలో సీజేఐ తప్పనిసరిగా ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని పేర్కొంది. కమిషనర్ల పదవీ భద్రతే ఈసీ స్వయంప్రతిపత్తికి మూలస్తంభం అని కేంద్రం అభిప్రాయపడింది.


పిటిషనర్ల తరఫున లాయర్ ప్రశాంత్ భూషణ్ మట్లాడుతూ నియామక కమిటీ నుంచి సీజేఐని తొలగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని అన్నారు. న్యాయం జరగడమే కాదు, అది పారదర్శకంగా ఉన్నట్లు ప్రజలకు కనిపించాలని విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 నాటి చట్టం ప్రకారం, సెలక్షన్ కమిటీలో ప్రధాన మంత్రితో పాటు ప్రధాని నామినేట్ చేసిన మరో మంత్రి, ప్రతిపక్ష నేత లేదా లోక్‌సభలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ లీడర్‌ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో ప్రధాన న్యాయమూర్తికి చోటు లేకపోవడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రీఫార్మ్స్ తదితరులు పిల్స్‌ను దాఖలు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

బస్సుకు అడ్డుగా 'లేడీ సింగం'.. సోషల్ మీడియాలో ప్రశంసలు

మోదీ రాజీనామా లేఖ వైరల్.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందనిదే..

Updated Date - Jul 30 , 2026 | 07:58 PM