భద్రతా బలగాలు సంయమనంతో ఉండాలి.. జెన్ జీ నిరసనలపై సుప్రీం కోర్టు
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:52 PM
‘సంసద్ చలో’ మార్చ్‌లో ఉద్రిక్తతలపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళనల వేళ పోలీసులు, భద్రతా బలగాలు సంయమనం పాటించాలని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ‘సంసద్ చలో’ మార్చ్‌లో ఉద్రిక్తతలపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళనల వేళ పోలీసులు, భద్రతా బలగాలు సంయమనం పాటించాలని స్పష్టం చేసింది. యువత రాళ్లు విసిరినా కఠినంగా వ్యవహరించవద్దని పేర్కొంది. కౌన్సెలింగ్ ఇచ్చి శాంతింపజేయడమే ప్రభుత్వాల బాధ్యత అని సుప్రీంకోర్టు పేర్కొంది. జులై 20న ‘సంసద్ చలో’ మార్చ్‌లో హింసను ప్రేరేపించిన నిర్వాహకులపై చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు తమ వాదన వినిపిస్తూ నిరసన సమయంలో హద్దుమీరిన వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రమాదకరమై ఒరవడికి నాంది పలికినట్టు అవుతుందని హెచ్చరించారు.
అయితే, నిరసనకారుల సమస్యను ‘వినడమే’ బలమైన ఆయుధమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం వైపు నుంచి దూకుడు ప్రదర్శిస్తే సామాజికంగా హింస మరింత పెరుగుతుందని కూడా సీజేఐ ధర్మాసనం హెచ్చరించింది. దారితప్పిన మూకలు రాళ్లు రువ్వినా యువతను శాంతింపజేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే తీవ్రమైన ప్రతిస్పందన సమాజంలో మంటలను మరింత పెంచుతుందని హెచ్చరించారు. అయితే, ఇటువంటి పరిస్థితులను ఎలా అదుపు చేయాలనే విషయంలో పోలీసులకే అనుభవం, అవగాహన ఉంటాయని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. శాంతియుత నిరసనలను ప్రోత్సహించాలని, పరిస్థితి చేయి దాటకుండా చూడాలని కూడా సర్వోతన్న న్యాయస్థానం సూచించింది. పిటిషనర్ల కేసును ఈ నిరసనలకు సంబంధించిన ఇతర పిటిషన్‌లతో ట్యాగ్ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
పెట్రోల్ బాంబు దాడులకు ప్లాన్.. ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు
'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం