పెట్రోల్ బాంబు దాడులకు ప్లాన్.. ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:11 AM
పంజాబ్ పోలీసులు మరో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. జంతర్‌మంతర్ నిరసనల్లో కల్లోలం సృష్టించేందుకు ప్లాన్ చేసిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ పోలీసులు మరో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఇటీవలి జంతర్‌మంతర్ నిరసనలను కూడా నిందితులు టార్గెట్ చేసినట్టు గుర్తించారు. మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హ్యాండ్లర్ల సూచనల మేరకు నిందితులు కుట్రపన్నినట్టు పోలీసులు గుర్తించారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, విద్యార్థుల నిరసనల సందర్భంగా నిందితులు జంతర్‌మంతర్‌కు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. పోలీసులను, ఇతర భద్రతా సిబ్బందిని టార్గెట్ చేసేలా వారికి పాక్ హ్యాండ్లర్లు శిక్షణ ఇచ్చినట్టు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అయితే, నిందితులు తమ ప్లాన్‌ను అమలు చేసేలోపే పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు. నిఘా సంస్థల సహకారంతో పంజాబ్ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు.
మొత్తం రెండు టెర్రర్ మాడ్యుల్స్ ఆటకట్టించినట్టు అధికారులు తెలిపారు. అరెస్టైన వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నట్టు చెప్పారు. నిందితుల నుంచి మూడు పిస్టల్స్, నాలుగు పెట్రోల్ బాంబులు, తొమ్మిది లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు ఏయే మార్గాల్లో నిధులు అందాయనే విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. నిధులు సమకూర్చడంలో పాక్ హ్యాండర్ల పాత్రను తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
విదేశాల్లోని ఐఎస్ఐ హ్యాండర్లలు స్థానిక వ్యక్తులైన వీరిని ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు ఉసిగొల్పినట్టు పోలీసులు తెలిపారు. దేశంలోని భద్రతా వ్యవస్థలపై నిఘా, అక్రమంగా ఆయుధాల సేకరణ, లా అండ్ ఆర్డర్ చెడగొట్టే చర్యల కోసం ఐఎస్ఐ హ్యాండ్లర్లు స్థానిక యువతను రిక్రూట్ చేసుకుంటున్నట్టు గుర్తించారు. ఇప్పటికే నిందితులు కొందరు రైల్వే ట్రాక్స్ సమపీంలో కెమేరాలను ఏర్పాటు చేసి వీడియోలను విదేశాల్లోని తమ హ్యాండర్లకు పంపించినట్టు కూడా పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలనూ చదవండి:
'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం
కర్ణాటకలో విషాదం.. రసాయన వాయువు పీల్చి ముగ్గురి మృతి..