నేటి తరానికి ఓపిక తక్కువ.. హనీమూన్ మర్డర్ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్య
ABN , Publish Date - Jul 23 , 2026 | 08:52 PM
సమాజం అనేక మార్పులకు లోనవుతున్న కారణంగా హనీమూన్ మర్డర్ లాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయని సుప్రీం కోర్టు తాజాగా వ్యాఖ్యానించింది.
ఇంటర్నెట్ డెస్క్: సమాజం అనేక మార్పులకు లోనవుతున్న కారణంగా హనీమూన్ మర్డర్ లాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయని సుప్రీం కోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. గతేడాది హనీమూన్ సందర్భంగా భర్తను హత్య చేసిన సోనమ్ రఘువంశీ బెయిల్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది. ఈ కేసులో జస్టిస్ ఎం. ఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలె ధర్మాసనం సోనమ్ బెయిల్‌ను రద్దు చేసింది. ఆమె మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
‘మారుతున్న సమాజంలో ఇలాంటి కేసులు వెలుగుచూస్తున్నాయి. నేటి తరానికి ఓపిక తక్కువ. సమస్యలకు తక్షణ పరిష్కారాలు కావాలని వారు కోరుకుంటున్నారు. వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన పలు కేసులు భవిష్యత్తులో కోర్టుల ముందుకు వస్తాయి’ అని జస్టిస్ సుందరేశ్ అన్నారు.
ఇక ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రస్తుత తరానికి అధిక సమాచారం అందుబాటులో ఉందని అన్నారు. కానీ జ్ఞానం మాత్రం లేదని వ్యాఖ్యానించారు. వాట్సాప్‌లో షేర్ చేస్తున్న సమాచారమే జ్ఞానంగా చెలామణీ అవుతోందని జస్టిస్ వరాలె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘హనీమూన్‌కు వెళ్లే భర్త తన వెంట బాడీగార్డులను కూడా తీసుకెళ్లినట్టు చెప్పే కామెడీ రీల్స్ వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఒకప్పుడున్న విశ్వాసం క్రమంగా తగ్గిపోతోంది. గతంలో ఇలాంటి సందర్భాల్లో ఉమ్మడి కుటుంబాలు భార్యాభర్తల సమస్యలను మెరుగ్గా పరిష్కరించేవి’ అని సొలిసిటర్ జనరల్ మెహతా చెప్పారు.
ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు ఉమ్మడి కుటుంబంలోని వారైతే అసంతృప్తిని ఎదుర్కోవడం, సర్దుకుపోవడం అలవాటు అవుతుంది. చిన్న కుటుంబాల్లోని వారు ఏదైనా తక్కువైతే మారాం చేస్తారు’ అని వ్యాఖ్యానించింది. చిన్న కుటుంబాల కారణంగా జనాల్లో డిప్రెషన్ పెరుగుతోందన్న నివేదికలు కూడా ఉన్నాయని మెహతా చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
మోదీ జీ.. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి.. లేదంటే..: అభిజీత్ దీప్కే
గుజరాత్‌లో వర్ష బీభత్సం: నీట మునిగిన కార్లు.. వీడియో వైరల్