ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం
ABN , Publish Date - Jun 13 , 2026 | 05:56 AM
మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తిరస్కరించటాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి...
రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బి) దీన్నే స్పష్టం చేస్తోంది
గతంలో కూడా ఎన్నడూ కోర్టులు జోక్యం చేసుకోలేదు
ఎన్నికల వివాదాలన్నింటినీ ఒకేలా చూస్తాం: సుప్రీంకోర్టు
మీనాక్షి నటరాజన్ పిటిషన్ కొట్టివేత
ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచన
ప్రజాస్వామ్యానికే షాక్.. వివరాలిచ్చినా ఈసీ పట్టించుకోలే: మీనాక్షి
న్యూఢిల్లీ, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తిరస్కరించటాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దాఖలైన పిటిషన్‌పై విచారణకు అనుమతించలేమని, ఈ మేరకు రాజ్యాంగ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ పేర్కొన్నారు. ఎన్నికల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవటానికి వీల్లేదని రాజ్యాగంలోని 329 (బి) ఆర్టికల్ స్పష్టం చేస్తోందని తెలిపారు. తెలంగాణలో తన మీద దాఖలైన ఒక కేసు గురించి వెల్లడించలేదన్న కారణంతో రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్‌ను తిరస్కరించటంపై మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. మీనాక్షి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఒక అభ్యర్థి నామినేషన్‌ను అక్రమంగా, ఏకపక్షంగా, తప్పుడు నిర్ణయంతో తిరస్కరించినప్పుడు కోర్టులు ఆర్టికల్ 32 కింద జోక్యం చేసుకోవచ్చన్నారు. రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని, మీనాక్షి నటరాజన్‌పై కేసును కోర్టు గుర్తించలేదని, ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేయలేదని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థకు ఉందన్నారు. ఆయన వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల వ్యవహారాల్లోని అభ్యంతరాలపై జోక్యం చేసుకోవాలని ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు ఎదుట, ఆర్టికల్ 226 కింద హైకోర్టు ఎదుట పలుమార్లు పిటిషన్లు దాఖలయ్యాయని గుర్తు చేసింది. అయితే, రాజ్యాంగంలోని 329 (బి) ఆర్టికల్‌కు అనుగుణంగా.. వీటిల్లో జోక్యం చేసుకోవటానికి సుప్రీంకోర్టు ఎన్నడూ అంగీకరించలేదని తెలిపింది. ఎన్నికల వివాదాలన్న తర్వాత అన్నిటికీ ఒకే నిబంధన వర్తిస్తుందని, వేర్వేరు రకాలుగా ఆ వివాదాలను విభజించి ఆర్టికల్ 329 (బి)కి వ్యతిరేకంగా వ్యవహరించలేమని తెలిపింది. రాజ్యాంగాన్ని అన్వయించే విషయంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించలేమని వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియ దశలో గతంలో ఏ కోర్టు అయినా జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయా అని జస్టిస్ మిశ్రా ప్రశ్నించారు. అన్ని కేసులకూ ఒకే సాధారణ సూత్రాన్ని వర్తించలేం కదా అని సింఘ్వీ పేర్కొన్నారు. మీనాక్షి పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం.. ఎన్నికల పిటిషన్ వేసుకోవటానికి అనుమతించింది. ఈ పిటిషనరే కాదు.. ఎవరైనా సంబంధిత హైకోర్టును ఈ మేరకు ఆశ్రయించవచ్చునని తెలిపింది (ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసే పిటిషన్‌ను ఎన్నికల పిటిషన్ అంటారు).
ఎన్నికల్లో పోటీ ప్రాథమిక హక్కు కాదు
మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచి గెలిచిన అభ్యర్థి తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఎన్నికల సంఘం తరఫున దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు చట్టబద్ధమైన హక్కే కాని, ప్రాథమిక హక్కు కాదని.. అందువల్ల ఎన్నికల ప్రక్రియ అమలులో ఉండగా ఆర్టికల్ 32 కింద పిటిషన్ ను ఆమోదించలేమన్నారు. ఒక అభ్యర్థి తనపై ఉన్న అన్ని క్రిమినల్ కేసులను నామినేషన్ పత్రాల్లో వెల్లడించాల్సి ఉంటుందని, అవి ఏ దశలో ఉన్నాయన్నది ముఖ్యం కాదన్నారు. ఆరోపణలు ఖరారైన దశలోనే కేసుల గురించి వెల్లడించాలన్న నిబంధన ఎక్కడా లేదని పేర్కొన్నారు. మరోవైపు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు
రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ
Read Latest TG News And Telugu News