సీఈసీ నియామకంపై పార్లమెంటును ఆదేశించవచ్చా?
ABN , Publish Date - May 07 , 2026 | 06:43 AM
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర కమిషనర్ల నియామకాన్ని నియంత్రించేలా చట్టం చేయాలని పార్లమెంటును తాము ఆదేశించవచ్చా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది...
చట్టం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించే వీలుందా?: సుప్రీంకోర్టు
శబరిమల కేసులో బిజీగా ఉన్నా.. వాయిదా వేయండి: తుషార్ మెహతా
ఇది శబరిమల కంటే ముఖ్యమైనది.. వాయిదా వేయబోమన్న ధర్మాసనం
న్యూఢిల్లీ, మే 6: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర కమిషనర్ల నియామకాన్ని నియంత్రించేలా చట్టం చేయాలని పార్లమెంటును తాము ఆదేశించవచ్చా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నియామకాలపై అధికారాన్ని కేంద్రప్రభుత్వానికి కట్టబెట్టిన 2023 నాటి చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల మీద విచారణను వాయిదా వేయాలన్న కేంద్రం అభ్యర్థనను తిరస్కరించింది. అది చాలా ముఖ్యమైన అంశమని, వాయిదా వేయటానికి కుదరదని తేల్చి చెప్పింది. ‘సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకం, సర్వీసు రూల్స్ చట్టం-2023’ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద జస్టిస్ దీపాంకర్‌దత్తా, జస్టిస్ సతీశ్‌చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం వాదనలు వినిపించారు. ప్రస్తుతం శబరిమల కేసులో తాను తలమునకలై ఉన్నానని, కాబట్టి, ఈ కేసును వాయిదా వేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఇది శబరిమల కంటే ముఖ్యమైన కేసని, వాయిదా వేయటం కుదరదని స్పష్టం చేసింది. ఈ అంశంపై చట్టం చేయాలంటూ పార్లమెంటుకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లలో ఒకరు కోరారని, దీనిని పరిగణనలోకి తీసుకోవచ్చా? అని జస్టిస్ దీపాంకర్‌దత్తా ప్రశ్నించారు. 2023 మార్చి 2న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. సీఈసీతోపాటు ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక ప్రక్రియను ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన త్రిసభ్య కమిటీ చేపట్టాలని ఈ తీర్పు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పార్లమెంటు ఒక చట్టం చేసే వరకూ ఈ తీర్పు అమలులో ఉంటుందని నాడు సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతిని జస్టిస్ దత్తా గుర్తు చేశారు. ‘సీఈసీని, కమిషనర్లను కేవలం కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమే ఎంపిక చేయకుండా నాడు కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అయితే, మళ్లీ చట్టం చేసే వరకేనంటూ పరిమితి ఎందుకు విధించింది? ఎందుకంటే, నాడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యానే’ అని వివరించారు. దీనిపై విచారణ గురువారం కూడా కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి..
విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ