పౌరసత్వ నిర్ధారణ న్యాయబద్ధంగా ఉండాలి.. అస్సాం ‘ఫారినర్స్’ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు!
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:55 AM
పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాంలో 27 మంది వ్యక్తుల పౌరసత్వ స్థితిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఢిల్లీ, జులై 13: పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా (Foreigner) ప్రకటించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాం లోని ఫారినర్స్ ట్రిబ్యునళ్లు ‘విదేశీయులు’గా ప్రకటించిన 27 మంది వ్యక్తుల పౌరసత్వ స్థితిపై ఇవాళ (సోమవారం) విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు కీలక తీర్పునిచ్చింది. 'పౌరసత్వం, విదేశీయుడి హోదా అనేవి అత్యున్నత రాజ్యాంగ, చట్టపరమైన ప్రాముఖ్యత కలిగిన అంశాలు' అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
న్యాయబద్ధతను దాటలేరు
అక్రమంగా పౌరసత్వం పొందాలని చూసే వారిని నిరోధించడంలో ప్రభుత్వానికి స్పష్టమైన ప్రయోజనాలు, బాధ్యతలు ఉంటాయనే విషయాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. 'చట్టబద్ధంగా అర్హత లేని వ్యక్తులు.. తప్పుడు పత్రాలు, తప్పుడు క్లెయిమ్‌ల ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందకుండా చూసేందుకు ప్రభుత్వానికి చట్టబద్ధమైన, బలమైన ఆసక్తి ఉంటుంది. అయితే, తుది విశ్లేషణలో ఆ ఆసక్తి లేదా ప్రయోజనం.. న్యాయబద్ధమైన ప్రక్రియను అధిగమించలేవు'. అని ధర్మాసనం పేర్కొంది.
బాధితులకు ఊరట.. కోర్టు కీలక ఆదేశాలు
ఈ కేసుకు సంబంధించి గతంలో గౌహతి హైకోర్టు, ఫారినర్స్ ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ట్రిబ్యునళ్లలో ఈ కేసుపై మరోసారి విచారణ జరిగే వరకు ఆ 27 మంది వ్యక్తులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే, పిటిషనర్ల పౌరసత్వాన్ని నిర్ధారించడానికి తాము ఇంకా ఎటువంటి ఆధారాలను పూర్తిగా పరిశీలించలేదని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
చిన్న చిన్న తప్పులకే 'విదేశీయులు'గా ముద్ర!
కోర్టును ఆశ్రయించిన వారిలో సాబిత్రి దేయ్, అజ్బహర్ అలీ, ఎండీ అక్బర్ అలీ, అబేదా ఖాతూన్, అనోవారా ఖాతూన్ అనే వ్యక్తులు ఉన్నారు. పాత ఓటర్ల జాబితాలో పేర్ల స్పెల్లింగ్స్ తప్పుగా పడటం, చిన్న చిన్న తేడాలు ఉండటం వంటి సాంకేతిక కారణాల వల్లే తమను విదేశీయులుగా ప్రకటించారని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాము భారతీయ పౌరులమేనని నిరూపించుకోవడానికి 1971 కంటే ముందు నాటి లెగసీ డేటా, ఓటర్ల జాబితాలు, భూమి రికార్డులను వారు కోర్టుకు సమర్పించారు.
కాగా, గత జూన్ నెలలో కూడా ఇలాంటి ఒక కేసులోనే.. ఐదుగురు మహిళలను విదేశాలుగా బహిష్కరించకుండా సుప్రీంకోర్టులోని మరో బెంచ్ అడ్డుకుంది. అవసరమైన అన్ని పత్రాలు సమర్పించినప్పటికీ, కేవలం పేర్ల స్పెల్లింగ్స్‌లో తేడాలు ఉన్నాయనే కారణంతో వారిని విదేశీయులుగా ప్రకటించారని అప్పట్లో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా తీర్పుతో అస్సాంలోని ఫారినర్స్ ట్రిబ్యునళ్లు పౌరసత్వ క్లెయిమ్‌లను పరిశీలిస్తున్న తీరు, వారి ప్రమాణాలపై దేశవ్యాప్తంగా చట్టపరమైన చర్చ మొదలైందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్