పోలీసుల మీడియా బ్రీఫింగ్ విధానాలు 3 నెలల్లో రూపొందించాలి: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Jan 22 , 2026 | 01:41 PM
వివిధ కేసులకు సంబంధించి పోలీసులు మీడియాకు ఇచ్చే సమాచారంపై నియంత్రణలు ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో పోలీస్ మీడియా బ్రీఫింగ్ విధానాలు రూపొందించి అమలు చేయాలంది.
న్యూఢిల్లీ, జనవరి 22 : పోలీసులు మీడియాకు ఇచ్చే బ్రీఫింగ్(సమాచారం)పై కఠిన నియంత్రణలు ఉండాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ కేసుల్లో పోలీసుల అనియంత్రిత ప్రెస్ బ్రీఫింగ్‌ల వల్ల నిందితుల హక్కుల ఉల్లంఘన, మీడియా ట్రయల్ కారణంగా కేసుల దర్యాప్తునకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(PUCL) దాఖలు చేసిన పిటిషన్‌పై చేపట్టిన విచారణలో సుప్రీంకోర్టు ఈమేరకు ఆదేశాలిచ్చింది.
జస్టిస్ ఎంఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటిశ్వర్ సింగ్ బెంచ్ జనవరి 15న ఇచ్చిన ఆదేశాలు.. సుప్రీంకోర్టు వెబ్‌సైట్లో బుధవారం పబ్లిష్ అయ్యాయి. వీటి ప్రకారం.. అన్ని రాష్ట్రాలు 3 నెలల్లో పోలీస్ మీడియా బ్రీఫింగ్ విధానాలు(పాలసీ) రూపొందించి అమలు చేయాలని అందులో పేర్కొంది న్యాయస్థానం. ఈ విధానాలు సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ(సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర నారాయణన్) రూపొందించిన ‘Police Manual for Media Briefing’ ఆధారంగా ఉండాలని చెప్పింది. మాన్యువల్‌ను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో 2 వారాల్లో అప్‌లోడ్ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలిచ్చింది. కాగా.. అమికస్ క్యూరీ మాన్యువల్(సుమారు 60 పేజీలు)ను అంతర్జాతీయ ప్రమాణాలు, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాల ఆధారంగా రూపొందించారు.
ఎందుకీ ఆదేశాలు?
PUCL పిటిషన్‌లో పోలీసులు కేసు వివరాలు.. నిందితుల పేర్లు, ఫొటోలు, ఆధారాలు ముందుగానే మీడియాకు బహిర్గతం చేయడం వల్ల, నిందితులకు న్యాయ విచారణలో న్యాయమైన అవకాశం(fair trial) దెబ్బతింటుంది.
మీడియా ట్రయల్ జరిగి పబ్లిక్ ఒపీనియన్ ప్రభావితమవుతుంది. అంతేకాకుండా.. దర్యాప్తునకు ఆటంకం కలుగుతుంది. అనవసర సమాచారం బయటపడి అనుమానాలు, భయాలు పెరుగుతాయి.
ఎవరు వెల్లడించాలి?
నియమిత ప్రెస్ ఆఫీసర్లు లేదా మీడియా బ్రీఫింగ్ సెల్ సభ్యులు మాత్రమే(అధికారికంగా గుర్తింపు పొందినవారు) కేసుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది.
ఏ దశలో ఏమి చెప్పాలి?
కేసు రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే పరిమిత సమాచారం(FIR వివరాలు, ఘటన స్థలం వంటివి). నిందితుల గుర్తింపు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలు.. దోషి నిర్ధారణ కాకముందు బహిర్గతం చేయకూడదు. దర్యాప్తు పూర్తయ్యే వరకూ సున్నితమైన సమాచారం(ఆధారాలు, సాక్షులు) నిరోధించాలి.
నిందితుల హక్కుల రక్షణ:
ప్రెజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్(నిర్దోషిగా భావించే హక్కు) ఉల్లంఘన కాకుండా చూడాలి.
పారదర్శకత Vs దర్యాప్తు సమగ్రత:
పబ్లిక్ సహకారం, ర్యూమర్లను అరికట్టడం కోసం బ్రీఫింగ్ ఉండాలి. కానీ దర్యాప్తునకు హాని చేయకూడదు. రాష్ట్రాలు ఈ మాన్యువల్ ఆధారంగా తమ స్థానిక అవసరాలకు తగినట్లు విధానాలు రూపొందించాలి. దీనికి సంబంధించి రాష్ట్రాలు ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని పరిశీలించిన న్యాయస్థానం.. ఇక ఆలస్యం చేయకుండా మరో మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి.
పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్
పాలిచ్చే పశువులకు చికెన్, మటన్ వ్యర్థాలు!
Read Latest Telangana News and National News