బుల్లెట్లే వాడుతుంటే.. పెల్లెట్లు ఎందుకు వాడొద్దు?
ABN , Publish Date - Jul 31 , 2026 | 05:37 AM
దేశంలో ప్రజా నిరసన ప్రదర్శనలు అదుపుతప్పి హింసాత్మకంగా మారినప్పుడు.. ఆందోళనకారులను నియంత్రించేందుకు పెల్లెట్ గన్స్ వాడే అధికారం భద్రతా బలగాలకు ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్డీ) 2016లో..
ప్రజా నిరసన అదుపుతప్పితే వాడే అధికారం బలగాలకు ఉంది
పెల్లెట్ గన్స్ వినియోగంపై నిషేధం విధించలేం: సుప్రీంకోర్టు
ఢిల్లీలో విద్యార్థులపై వాడిన పెల్లెట్లు భద్రపర్చాలని ఆదేశం
సుప్రీం వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి: సీజేపీ నేత సౌరవ్‌దాస్
సీజేపీ నిరసనకారులపై చర్యలు తీసుకోం!: ఢిల్లీ సర్కారు
న్యూఢిల్లీ, జూలై 30: దేశంలో ప్రజా నిరసన ప్రదర్శనలు అదుపుతప్పి హింసాత్మకంగా మారినప్పుడు.. ఆందోళనకారులను నియంత్రించేందుకు పెల్లెట్ గన్స్ వాడే అధికారం భద్రతా బలగాలకు ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్డీ) 2016లో సమర్పించిన సలహా నివేది ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో పౌరులపై పెల్లెట్ గన్స్ వాడే అధికారం పోలీసులకు ఉందని పేర్కొంది. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా 20న ఢిల్లీలో విద్యార్థులు చలో సంసద్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు పెల్లెట్ గన్స్‌ను వాడటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజాందోళనల సమయంలో నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వినియోగాన్ని నిషేధించాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ ఆజాద్‌తోపాటు ఢిల్లీ నిరసనల్లో పెల్లెట్లు తగిలి గాయపడిన ప్రశాంత్‌కుమార్ సింగ్, షేక్ ఇర్షాద్ మన్సూరీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ మోహనలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.
ఈ సందర్భంగా జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘లాఠీచార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగంతో కూడా పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితుల్లో భద్రతా బలగాలు ఆయుధాలను వినియోగించవచ్చని పోలీస్ నిబంధనలు చెబుతున్నాయి. శాంతియుత ప్రజా నిరసనల్లో అసాంఘిక శక్తులు ప్రవేశించి హింసకు పాల్పడినప్పుడు అవసరమైతే పోలీసులు బుల్లెట్లు కూడా వినియోగిస్తున్నారు. అలాంటప్పుడు పెల్లెట్ తుపాకులపై నిషేధం ఎలా విధించగలం? పోలీస్ నిబంధనలు మార్చకుండా నిషేధం సాధ్యంకాదు. పిటిషనర్లు ముందుగా ఆ నిబంధనలను సవాల్ చేయకుండా పెల్లెట్ గన్స్‌పై నిషేధం కోరటం కుదరదు. ఈ పిటిషన్‌లో స్పష్టత లోపించింది’ అని వ్యాఖ్యానించారు. చలో సంసద్ సందర్భంగా పోలీసులు, ఆర్పీఎఫ్ బలగాలు విద్యార్థులపై ప్రయోగించిన పెల్లెట్లతోపాటు కరెంటు షాక్ ఇచ్చే బ్యాటన్స్, డ్రోన్ విజువల్స్, సీసీకెమెరాల ఫుటేజీలను భద్రపర్చాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్లు కోరితే ఆ పెల్లెట్లను పరీక్షించేందుకు అభ్యంతరం లేదని పేర్కొంది.
పోలీస్ నిబంధనలు ఎక్కడ?
ధర్మాసనం ఉదహరించిన పోలీస్ నిబంధనలపై పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ అనుమానాలు వ్యక్తంచేశారు. ఆ నిబంధనలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. బీపీఆర్డీ 2016లో ఇచ్చిన నివేదికలో నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వాడొచ్చని చెప్పలేదని అన్నారు. ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సందర్భంగా జోక్యం చేసుకొంటూ.. ఈ ఘటనపై విచారణలో కోర్టుకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పెల్లెట్స్‌తోపాటు దర్యాప్తునకు అవసరమైన అన్ని వస్తువులను భద్రపరుస్తామని హామీ ఇచ్చారు. కాగా, ధర్మాసనం వ్యాఖ్యలు అసహ్యకరంగా ఉన్నాయని సీజేపీ నేత సౌరవ్‌దాస్ అన్నారు.
మా జవాన్లు ఏం చేసినా నాదే బాధ్యత..
విద్యార్థులపై భద్రతా సిబ్బంది దారుణంగా దాడి చేశారని విమర్శలు వినిపిస్తున్న వేళ.. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కీలక ప్రకటన చేశారు. సీఆర్పీఎ్‌ఫతోపాటు ఆ దళంలో భాగమైన ఆర్‌ఏఎఫ్ బలగాలు చేపట్టే ఏ చర్యకైనా తానే బాధ్యత వహిస్తానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రధానిపై అభ్యంతరకర పోస్టులు.. ఢిల్లీ పోలీసుల నోటీసులు
ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెట్టిన సోషల్ మీడియా ఖాతాదారులతో పాటు వార్తా పోర్టళ్లకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తమ పోస్టుల్లో దుర్భాషలాడిన ఖాతాదారుల గురించి పూర్తి సమాచారం కోరుతూ ఎక్స్‌కు కూడా నోటీసులు పంపారు. అయితే ఎన్ని ఎక్స్ ఖాతాలకు పోలీసులు నోటీసులు పంపారో తెలియరాలేదు. నిరసనల సమయంలో, ఆ తర్వాత అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను సమీక్షించిన అనంతరం పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. కాగా, ప్రధాని మోదీ ఫేస్‌బుక్ పోస్టుపై తాత్కాలిక ఆంక్షలు విధించిన ఘటనను కేంద్రం సీరియ్‌సగా తీసుకుంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని మెటాను కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ ఆదేశిస్తూ మరోసారి సమన్లు జారీ చేసింది. ‘అత్యున్నత స్థాయిలో జోక్యం చేసుకొని.. అసలు ఏం జరుగుతుందో వివరించాలని మేం మెటాను కోరాం’ అని కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి
కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ