ఇథనాల్ కేటాయింపుల వివాదం.. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టేటస్ కో..
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:01 PM
2025-26 సరఫరా సంవత్సరానికి సంబంధించి ఇథనాల్ కేటాయింపుల విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
న్యూఢిల్లీ, జూన్ 30: 2025-26 సరఫరా సంవత్సరానికి సంబంధించి ఇథనాల్ కేటాయింపుల విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బీపీసీఎల్ తరఫున కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలు వినిపించారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే అద్భుతమైన ప్రక్రియ ఫలితాలు వచ్చే ఏడాదికి స్పష్టంగా తెలుస్తాయని కోర్టుకు తెలిపారు.
దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. పిటిషనర్లు మొదట కర్ణాటక హైకోర్టుకు చెందిన డివిజన్ బెంచ్‌ను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించింది. దీనికి వెంకటరమణి సమాధానం ఇస్తూ.. అక్టోబర్ 2025 నాటికే ఇథనాల్ సరఫరా ఒప్పందాలన్నీ ముగిసిపోయాయని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఈ ప్రక్రియను మొదటికి తెస్తే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమానికి తీవ్ర ఆటంకం కలుగుతుందని అన్నారు.
దేశవ్యాప్తంగా ఇలాంటి వివాదాలు పలు రాష్ట్రాల హైకోర్టుల్లో నడుస్తున్నాయని, దీనివల్ల వేర్వేరు కోర్టులు పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇచ్చే అవకాశం ఉందని వివరించారు. ఈ కేసులన్నింటినీ ఒకే చోటికి బదిలీ చేయాలని కోరారు. అటార్నీ జనరల్ విజ్ఞప్తిని ప్రైవేట్ కంపెనీల తరఫు న్యాయవాది సిద్ధార్థ్ దేవ్ వ్యతిరేకించారు. ఇదంతా కేసు విచారణను ఆలస్యం చేయడానికి చేస్తున్న ప్రయత్నమని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు స్టేటస్ కో అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారితో పాటు ఇద్దరి మృతి
అమ్మకాల ఒత్తిడిలో ఐటీ, ఆటో షేర్లు.. సూచీలకు తప్పని నష్టాలు..