మైనర్లందరినీ విడుదల చేయాలి!
ABN , Publish Date - Jul 29 , 2026 | 06:22 AM
నీట్ తదితర ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొని అరెస్టయిన 18 ఏళ్లలోపు విద్యార్థులందరినీ తక్షణం విడుదల చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. నేర చరిత్ర లేని మైనర్ విద్యార్థులను విడిచిపెట్టాలని...
వారు నేరచరిత్ర లేనివారికే వర్తింపు.. నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల మీద దర్యాప్తు కొనసాగించవచ్చు
విద్యార్థుల కేసులపై సుప్రీం ఆదేశాలు.. పోలీసుల లాఠీచార్జిపై సిట్ ఏర్పాటును పరిశీలిస్తున్నాం
నిరసనలపై పోలీసులు ఎలా వ్యవహరించాలన్న మార్గదర్శకాలను సమీక్షించాల్సి ఉందని వ్యాఖ్య
ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో విద్యార్థుల మీద పోలీసులు దారుణంగా దాడి చేశారు
మాజీ సీజేఐ లేదా సుప్రీం మాజీ జడ్జితో సిట్ ఏర్పాటు చేయాలి.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు
న్యూఢిల్లీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): నీట్ తదితర ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొని అరెస్టయిన 18 ఏళ్లలోపు విద్యార్థులందరినీ తక్షణం విడుదల చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. నేర చరిత్ర లేని మైనర్ విద్యార్థులను విడిచిపెట్టాలని, వారి మీద ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని పేర్కొంది. ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల మీద దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది. మరోవైపు, ఢిల్లీతోపాటు వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల ర్యాలీల మీద పోలీసులు దమనకాండ జరిపారన్న ఆరోపణలపై సమగ్రంగా, నిజాయితీగా, స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. పోలీసు సిబ్బందిపై కూడా దాడులు జరిగాయని వారి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదులను కూడా ఈ దర్యాప్తులో పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. సిట్ ఏర్పాటుపై తాము నిర్ణయం తీసుకునేలోపు తమ వాదనలు వినిపించాలని కేంద్రప్రభుత్వానికి, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ర్యాలీ మీద, తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన ర్యాలీల మీద పోలీసులు అతిగా బలప్రయోగం చేశారంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి మీద సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాలా బాగ్చీ, జస్టిస్ మోహనలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) దళాలు ఓ డీసీపీ ర్యాంకు అధికారి ఆదేశాలతో విచ్చలవిడిగా కొట్టారని పిటిషనర్లు ఆరోపించారు. మేకులు దించిన లాఠీలతో కొట్టారని, కరెంటు షాక్ కలిగించే ఎలక్ట్రిక్ బ్యాటన్‌లతో దాడి చేశారని, రబ్బరు బుల్లెట్లను, పెల్లెట్‌గన్స్‌ను, టియర్‌గ్యా్‌సను యథేచ్ఛగా ప్రయోగించారని తెలిపారు. మాజీ సీజేఐ లేదా సుప్రీంకోర్టు మాజీ జడ్జితో సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని, ఈ ఘటనలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ.. ‘‘దీని మీద ఒక స్వతంత్ర దర్యాప్తు ఎందుకు జరపకూడదు?’ అని కేంద్రప్రభుత్వం న్యాయవాదిని ఉద్దేశించి ప్రశ్నించారు. అతిగా ఎవరు వ్యవహరించినా చట్టం తన పని తాను చేస్తుందని, దర్యాప్తు ద్వారా బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిందేనని, లేకపోతే దర్యాప్తునకు అర్థమే లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో నిరసనలు సర్వసాధారణమని, వాటి పట్ల పోలీసులు ఎలా వ్యవహరించాలి అన్నదానిపై ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను సమీక్షించి, మెరుగుపరచాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజల శాంతియుత నిరసనలపై టియర్‌గ్యాస్ వంటివి ప్రయోగించవచ్చా అన్న అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు. దీనిపై అఖిల భారత స్థాయిలో అధ్యయనం జరిపేందుకు హైపవర్ కమిటీని నియమించాల్సిన అవసరం ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ ఫుటేజ్, పోలీసులు వద్ద ఉన్న బాడీ కెమెరాల రికార్డింగ్‌ను భద్రపరచాలని విద్యార్థుల నిరసనలు జరిగిన అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేశారు.
వాళ్లేమైనా ఉగ్రవాదులా
ఢిల్లీలో జరిగిన చలో సంసద్ సందర్భంగా పోలీసులు పెల్లెట్‌గన్స్‌ను ప్రయోగించటాన్ని వ్యతిరేకిస్తూ ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) మాజీ స్పెషల్ డైరెక్టర్ యశోవర్ధన్ ఆజాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో రాళ్లు విసిరే మూకలను చెదరగొట్టటానికి ప్రవేశపెట్టిన పెల్లెట్‌గన్స్‌ను విద్యార్థుల మీద ఎలా ప్రయోగిస్తారని ఆయన ప్రశ్నించారు. ‘వాళ్లు ఉగ్రవాదులో, సాయుధ తిరుగుబాటుదారులో కాదు. తమకున్న ప్రజాస్వామ్య నిరసన హక్కును వినియోగించుకుంటున్న విద్యార్థులు. వాళ్ల మీద పెల్లెట్‌గన్స్‌ను వాడటం నన్ను తీవ్రంగా కలచివేసింది’ అని పేర్కొన్నారు. పెల్లెట్‌గన్స్ వాడకం మీద జమ్మూకశ్మీర్‌లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమైందని, ప్రాణాలకు ప్రమాదం తలెత్తే అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప వాటిని వాడకుండా నిషేధం విధించాలని కోరారు. మరోవైపు, ఢిల్లీలో జరిగిన ‘చలో సంసద్’లో తాము పాల్గొనకపోయినా, పోలీసులు ప్రయోగించిన పెల్లెట్‌గన్స్‌లో గాయాలపాలయ్యామని ప్రశాంత్‌కుమార్, షేక్ ఎర్షాద్ అనే ఇద్దరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
డీసీపీ ఆదేశాలతోనే పెల్లెట్‌గన్స్ ప్రయోగం
జంతర్‌మంతర్ వద్ద విధుల్లో ఉన్న డీసీపీ అనుమతితోనే విద్యార్థుల మీద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 55 నాన్ ఎలక్ట్రికల్ షెల్స్‌ను, 15 ఎలక్ట్రికల్ షెల్స్‌ను, 5 టియర్‌గ్యాస్ గ్రెనేడ్లను, యాంటీరియట్ గన్స్ నుంచి రెండు రౌండ్లను, రెండు రౌండ్ల ప్లాస్టిక్ పెల్లెట్లను ప్రయోగించినట్లుగా పోలీసు రికార్డులు వెల్లడించాయి.
పలు రాష్ట్రాల్లో కేసులు వెనక్కి
న్యూఢిల్లీ, జూలై 28 : నీట్ ప్రశ్నపత్రం లీకేజీని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసుల విషయంలో పలు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. విద్యార్థులపై ఇప్పటికే పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, అరెస్టయిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని బిహార్, మహారాష్ట్ర, అసోం, రాజస్థాన్ రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేశాయి. ఇదిలా ఉండగా, నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొని కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, నిరసనకారులకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ సీజేపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక లీగల్ ఎయిడ్ ఫండ్‌కు సోమవారం రూ.కోటి విరాళం ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పేపర్ లీక్‌లు అరికట్టేందుకే బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు
For More National News And Telugu News