Share News

అమెరికా ‘ప్రిన్స్‌టన్‌’తో సంబంధం లేదని ప్రకటించండి!

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:51 AM

అమెరికాకు చెందిన ప్రఖ్యాత విద్యాసంస్థ ‘ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ’ పేరుతో విద్యార్థులను తప్పుదోవ పట్టించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రిన్స్‌టన్‌ పేరుతో...

అమెరికా ‘ప్రిన్స్‌టన్‌’తో సంబంధం లేదని ప్రకటించండి!

  • 8 సర్టిఫికెట్లపై స్పష్టంగా ముద్రించండి

  • 8 తెలంగాణలో ప్రిన్స్‌టన్‌ కాలేజీలు నడుపుతున్న వాగ్దేవి ఎడ్యుకేషనల్‌ సొసైటీకి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): అమెరికాకు చెందిన ప్రఖ్యాత విద్యాసంస్థ ‘ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ’ పేరుతో విద్యార్థులను తప్పుదోవ పట్టించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రిన్స్‌టన్‌ పేరుతో తెలంగాణలో కాలేజీలు నడుపుతున్న ‘ది వాగ్దేవి ఎడ్యుకేషనల్‌ సొసైటీ’ తదితర సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అమెరికాకు చెందిన ‘ది ట్రస్టీస్‌ ఆఫ్‌ ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ’.. తమ బ్రాండ్‌నేమ్‌ను, ప్రతిష్ఠను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. తెలంగాణలో ‘ప్రిన్స్‌టన్‌’ పేరుతో విద్యాసంస్థలు నడుపుతున్న వాగ్దేవి ఎడ్యుకేషనల్‌ సొసైటీని తమ పేరు వాడుకోకుండా నిలువరించాలని కోరింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. తెలంగాణకు చెందిన విద్యాసంస్థలు 1991 నుంచి ఈ పేరును వాడుతున్నాయని, వాటి పరిధి తెలంగాణకే పరిమితమైందని పేర్కొంటూ.. ప్రస్తుతం ప్రిన్స్‌టన్‌ పేరుతో నడుస్తున్న విద్యాసంస్థలకు మినహాయింపునిచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసే విద్యాసంస్థలకు ఆ పేరు పెట్టవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి సోమవారం తీర్పును వెలువరించింది. తీర్పు వివరాలు బుధవారం వెల్లడయ్యాయి. ‘అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీకి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రతిష్ఠ ఉన్నాయి.


వాటిని రక్షించుకునే హక్కు ఆ సంస్థకు ఉంది. మరొకరు అదే పేరుతో ఇక్కడ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నప్పుడు, విద్యార్థులు ఆ పేరు చూసి మోసపోయే అవకాశం కచ్చితంగా ఉంది. అందుకోసమే హైకోర్టు విధించిన నిబంధనలకు అదనంగా మరికొన్ని షరతులు విధిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రిన్స్‌టన్‌ వర్సిటీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ‘ది వాగ్దేవి ఎడ్యుకేషనల్‌ సొసైటీ’ తన వెబ్‌సైట్‌లలో పెద్ద అక్షరాలతో కనిపించేలా ప్రకటనను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ నెల 1-12వ తేదీల మధ్య రోజు విడిచి రోజు దినపత్రికల్లో కనీసం 1/4 పేజీ ప్రకటన ఇవ్వాలని పేర్కొంది. ప్రాస్పెక్టస్‌, అడ్మిషన్‌ మెటీరియల్‌తోపాటు ప్రతి క్యాంపస్‌ బయట ఇదే తరహా డిస్‌క్లెయిమర్‌ బోర్డులను ప్రదర్శించాలని, విద్యార్థులకు జారీ చేసే సర్టిఫికెట్లపై స్పష్టమైన అక్షరాలతో ముద్రించాలని స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే వీటన్నింటినీ అమలు చేయాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 05:51 AM