మతంలో ఏది మూఢవిశ్వాసం? ఏది కాదు?
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:00 AM
ఒక మతంలో ఏది మూఢవిశ్వాసం? ఏది కాదు? అని నిర్ణయించే అధికారం తమకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేరళలోని శబరిమలతోపాటు దేశంలోని పలు ఆలయాల్లోకి...
మతంలో ఏది మూఢవిశ్వాసం? ఏది కాదు?
ఈ అంశాన్ని నిర్ణయించే అధికారం మాకుంది
చట్టసభలు మౌనంగా ఉంటే ప్రజలు, నైతికత
కోసం మేం రంగంలోకి దిగుతాం: సుప్రీంకోర్టు
మత విషయాల్లో జడ్జిలు నిపుణులు కారు..
సెక్యులర్ కోర్టు నిర్ణయం తీసుకోలేదు
చట్టసభలే చట్టం చేసి సంస్కరిస్తాయి: కేంద్రం
అయ్యప్ప భక్తులు కానివారు శబరిమల
సంప్రదాయాల్ని ఎలా ప్రశ్నిస్తారు: జస్టిస్ నాగరత్న
‘ఆలయాల్లో మహిళలపై వివక్ష’ అంశం మీద
కొనసాగుతున్న విచారణ
వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కం
నేరం కాదన్న తీర్పులు మంచి తీర్పులు కావు
దీనిపై సుప్రీంకోర్టు ప్రకటన చేయాలి
కేంద్రం నోట్ సమర్పణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఒక మతంలో ఏది మూఢవిశ్వాసం? ఏది కాదు? అని నిర్ణయించే అధికారం తమకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేరళలోని శబరిమలతోపాటు దేశంలోని పలు ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ బుధవారం కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలో 9 మంది న్యాయమూర్తులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. మత సంప్రదాయాల్లో ఏది మూఢ విశ్వాసం? ఏది కాదు? అనేది కోర్టులు నిర్ణయించలేవని, అది చట్టసభల పని అని చెప్పారు. అవసరమైతే చట్టసభలే సంస్కరణలు చేపట్టి కొత్త చట్టం తీసుకువస్తాయన్నారు. చేతబడి వంటి వాటిని నిషేధిస్తూ వచ్చిన చట్టాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మన దేశం ఎంతో వైవిధ్యపూరితమని, నాగాలాండ్‌లో పాటించే ఓ మతపరమైన ఆచారం తనకు మూఢనమ్మకంగా అనిపించవచ్చన్నారు. న్యాయమూర్తులు న్యాయశాస్త్రంలో నిపుణులుగానీ.. మత విషయాల్లో కాదని పేర్కొన్నారు. ఒక సెక్యులర్ కోర్టు.. ఓ మతాచారాన్ని మూఢనమ్మకంగా ప్రకటించలేదని తుషార్ మెహతా తెలిపారు. దీనిపై ధర్మాసనంలో భాగంగా ఉన్న జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ స్పందిస్తూ.. చేతబడి వంటి వాటిని ప్రోత్సహించే ఓ నమ్మకం విషయంలో చట్టసభలు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు.. ప్రజల సంక్షేమం, నైతికతలను కాపాడటానికి కోర్టు రంగంలోకి దిగి.. ఆ నమ్మకాన్ని నిషేధించమని ఆదేశాలు జారీ చేయవద్దా? అని వ్యాఖ్యానించారు. ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా స్పందిస్తూ.. ఒక మతాచారం మూఢనమ్మకమా కాదా అని నిర్ణయించే పరిధి, అధికారం కోర్టుకు ఉందన్నారు. చట్టసభలదే తుదినిర్ణయం అని చెప్పలేరని స్పష్టం చేశారు.
పిటిషనర్లు ఎవరూ భక్తులు కారు!
విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. అయ్యప్ప స్వామి భక్తులు కాని వారు శబరిమల ఆలయంలో కొనసాగే సంప్రదాయాలను ప్రశ్నించవచ్చా అని పేర్కొన్నారు. ఒక మతానికి సంబంధించిన అంశాన్ని ఆ మత తత్వశాస్త్రం ఆధారంగానే చూడాలని, ఇతర మతాల కోణంలో చూడవద్దని సూచించారు. ఈ కేసులో పిటిషనర్లు ఎవరు? అని మెహతాను ప్రశ్నించగా.. ‘ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్’ అనే సంస్థ దాఖలు చేసిందని ఆయన బదులిచ్చారు. దీనిపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. ‘వారెవరూ భక్తులు కారు. శబరిమల ఆలయంతో సంబంధం లేని వారు. అలాంటి వాళ్లు పిటిషన్ వేస్తే దానిని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలా? ఒక అంశంతో సంబంధం లేని సంస్థ కేసు దాఖలు చేస్తే దానిని కొట్టేయాలన్న అంశాన్ని మేమందరమూ ట్రయల్‌కోర్టుల స్థాయిలోనే ప్రాక్టీస్ చేశాం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తుషార్ మెహతా తిరిగి వాదనలు వినిపిస్తూ.. ఈ రోజుల్లో న్యాయవ్యవస్థలో పారదర్శకత, వెసులుబాటు పెరిగిందని.. ఒక వ్యక్తి ఈ-ఫైలింగ్ ద్వారా రాసే లేఖ కూడా కోర్టును చేరుతోందని, పాతరోజుల్లోలాగా.. ఒకరి తరఫున మరొకరు ప్రాతినిధ్యం వహించే పరిస్థితి లేదన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు(పిల్) దుర్వినియోగం అవుతున్నాయని చెప్పారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. బలమైన అంశం ఉందని భావించినప్పుడే ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారణకు తీసుకుంటున్నామన్నారు.
అవి రెండూ మంచి
తీర్పులు కావు!
వివాహేతర సంబంధాల్ని, స్వలింగ సంపర్కాన్ని నేరం కాదని ప్రకటిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులపై కేంద్రం ఆక్షేపణ వ్యక్తం చేసింది. ‘అవి మంచి తీర్పులు కావని ప్రకటించాలి’ అంటూ ధర్మాసనానికి తుషార్ మెహతా ఒక నోట్ సమర్పించారు. రాజ్యాంగ నైతికతను స్వీయాత్మక ధోరణిలో వర్తింప జేయటం వల్ల ఈ తీర్పులు వచ్చాయన్నారు. శబరిమల అంశంపై విచారణ సందర్భంగా ధర్మాసనం.. మతస్వేచ్ఛ పరిధి గురించి కొన్ని ప్రశ్నలను లేవదీసింది. వీటిలో ఆర్టికల్ 25, 26లు పేర్కొనే నైతికత ఒకటి. రాజ్యాంగ నైతికత కూడా దీంట్లో భాగమేనా అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ నైతికత అనేది సెంటిమెంటు మాత్రమేనన్నారు. దానిపైన ఆధారపడి చట్టాలను చేయలేమన్నారు. ఒక ప్రజాస్వామ్యదేశంలో మెజారిటీ అభిప్రాయమే మనుగడలో ఉంటుందని, పార్లమెంటులో మెజారిటీనే చట్టాలు చేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..