'తప్పనిసరి చేస్తే మహిళలను ఎవరూ ఉద్యోగాల్లోకి తీసుకోరు': సుప్రీంకోర్టు
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:12 PM
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవుల నియమాలను రూపొందించేలా రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తే అది వాళ్ల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవుల అంశం మీద దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం) కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా మహిళలకు, విద్యార్థినులకు అనివార్య నెలసరి లీవ్ (Menstrual Leave) అమలు చేయాలని కోరుతూ దాఖలైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL)ను కోర్టు తిరస్కరించింది.
పిటిషన్ వివరాలు:
న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, నెలసరి సమస్యల వల్ల బాధపడే మహిళలకు, విద్యార్థినులకు ప్రత్యేక లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. అలాగే, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961లోని సెక్షన్ 14ని సమర్థవంతంగా అమలు చేయాలని, దాని ఆధారంగా మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ తీసుకురావాలని అభ్యర్థించారు.
సుప్రీంకోర్టు వైఖరి:
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా CJI పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇందులో రెండు పార్శ్వాలు ఉన్నాయి. నెలసరి సెలవులు ఇస్తే ఉద్యోగాల్లో చేరేందుకు మరింతమంది మహిళలను ప్రోత్సహించినట్లవుతుంది. అయితే, వీటిని తప్పనిసరి చేయాలని యజమానులను బలవంతపెడితే అది ప్రతికూల పరిస్థితులకు దారితీయొచ్చు. చట్టం ద్వారా అనివార్యంగా నెలసరి సెలవులు ఇవ్వాలంటే, ఎవరూ మహిళలను ఉద్యోగాలకు తీసుకోరు. సంస్థల యాజమాన్యాల మనస్తత్వం మీకు తెలియదు! వాలంటరీగా సెలవులు ఇస్తే బాగుంది.. కానీ చట్టం చేసి కంపల్సరీ చేస్తే... జ్యుడీషియరీలో, గవర్నమెంట్ జాబ్స్‌లలో కూడా తీసుకోరు. నెలసరి వల్ల ఏదో చెడు జరుగుతోంది అన్నట్టుగా చూపిస్తే, మహిళలను ఆత్మనూన్యతకు గురిచేసేలా ఉంటుంది' అని CJI అభిప్రాయపడ్డారు. అయితే, సంబంధిత అధికారులు అన్ని స్టేక్‌హోల్డర్లతో చర్చించి నెలసరి లీవ్ పాలసీ రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
నేపథ్యం:
కేరళ రాష్ట్రంలోని స్కూళ్లలో ఆడపిల్లలకు నెలసరి లీవ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు వాలంటరీగా మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా దీని మీద కంపల్సరీ చట్టం చేయాలని న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇవాళ ఈ పిటిషన్ మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఇవి కూడా చదవండి..
మిడిల్‌ఈస్ట్‌లో హింసకు స్వస్తి పలకండి: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌తో మోదీ
తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ.. శశికళ సంచలన ప్రకటన