ఆ న్యాయమూర్తి అవినీతిపరుడు
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:13 AM
రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా తీవ్ర ఆరోపణలు చేశారు. జస్టిస్ శర్మ సంపన్నులు...
సంపన్నుల కేసులను తానే విచారిస్తూ
అనుకూల తీర్పులు ఇస్తున్నారు
పక్షపాతంతో అక్రమాలకు పాల్పడుతున్నారు
వచ్చే నెలాఖరున రిటైర్మెంట్‌లోపు
‘భారీ సిక్సర్లు కొట్టే యత్నాల్లో’ ఉన్నారు
సీజేఐతో సాన్నిహిత్యం ఉందని చెప్పుకొంటూ
ఇతర న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు
రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక సీజే
జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మపై సుప్రీంకోర్టు
జడ్జి జస్టిస్ సందీప్ మెహతా ఆరోపణలు
జస్టిస్ శర్మను బదిలీ చేయాలంటూ
సీజేఐకి ఈ నెలలో వరుసగా మూడు లేఖలు
చర్యలు తీసుకోకపోవడంపై ఆక్షేపణ
న్యూఢిల్లీ, ఆగస్టు 26: రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా తీవ్ర ఆరోపణలు చేశారు. జస్టిస్ శర్మ సంపన్నులు, వ్యాపారవేత్తలకు సంబంధించిన కేసులను తన ధర్మాసనానికి బదిలీ చేస్తూ, వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారని పేర్కొన్నారు. పక్షపాతం, బంధుప్రీతితో వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. ఆయనను రాజస్థాన్ తాత్కాలిక సీజే పదవి నుంచి తొలగించి, వేరే రాష్ట్రానికి చెందిన మరో న్యాయమూర్తికి పూర్తికాలపు సీజేగా బాధ్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ని కోరారు. ఈ మేరకు ఈ నెల 2, 10, 17వ తేదీల్లో మూడు లేఖలు రాశారు. ఈ సంచలన లేఖల్లోని వివరాలు బుధవారం మీడియాకు వెల్లడయ్యాయి. తాత్కాలిక సీజేగా తనకున్న అధికారాలను ఉపయోగించుకుంటూ జస్టిస్ శర్మ.. ఇతర బెంచీల ముందు నమోదైన కేసులను కూడా సహేతుక కారణం లేకుండా తన బెంచీకి బదిలీ చేసుకున్నారని జస్టిస్ మెహతా తెలిపారు. రాజస్థాన్‌కే చెందిన తనకు ఆ రాష్ట్రానికి చెందిన పలువురు జడ్జిలు జస్టిస్ శర్మ పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారని చెప్పారు. వీటి గురించి తెలియజేసినప్పుడు, చర్యలు తీసుకుంటానని సీజేఐ సూర్యకాంత్ చెప్పిన సంగతిని ఆగస్టు 2వ తేదీ నాటి తొలి లేఖలో జస్టిస్ మెహతా గుర్తు చేశారు. అయినప్పటికీ, ఇప్పటి వరకూ జస్టిస్ శర్మను తొలగించి మరొకరిని నియమించలేదని పేర్కొన్నారు. ఆగస్టు 10వ తేదీ నాటి లేఖలో.. ఉదయ్‌పూర్‌లో విలువైన భూములకు సంబంధించిన ఓ కేసును జస్టిస్ శర్మ తన బెంచికి బదిలీ చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో ఓ కక్షిదారు తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కమలాకర్ శర్మ కోడలిని రాజస్థాన్ హైకోర్టు జడ్జిగా నియమించేందుకు జస్టిస్ శర్మ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వచ్చే నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ శర్మ.. ‘ఆలోపే భారీ సిక్సర్‌లు కొట్టటానికి ప్రయత్నిస్తున్నారు’ అంటూ ఆయన అవినీతి గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఆగస్టు 17వ తేదీ నాటి లేఖలో దిగువ స్థాయి న్యాయాధికారులతో జస్టిస్ శర్మ వ్యవహరిస్తున్న తీరును జస్టిస్ మెహతా వివరించారు. జిల్లా న్యాయవ్యవస్థలో సీనియర్ అధికారిణిగా ఉన్న నందినీ వ్యాస్‌ను జస్టిస్ శర్మ తీవ్రంగా బెదిరించటంపై ఆమె భర్త, రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాశంకర్‌వ్యాస్ ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు సిట్టింగ్ జడ్జిలకు మెసేజీలు పంపించారని తెలిపారు. సీజేఐతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకొనే జస్టిస్ శర్మ.. సహచర జడ్జిలను, దిగువ స్థాయి న్యాయాధికారులను బదిలీ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతుంటారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ శర్మను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, పూర్తిస్థాయి సీజేను నియమించాలని కొలీజియంకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై తాను పలుమార్లు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోకపోవటం న్యాయవ్యవస్థ ప్రయోజనాలకే విరుద్ధమని సీజేఐ సూర్యకాంత్‌కు జస్టిస్ మెహతా స్పష్టం చేయటం విశేషం. కాగా, జస్టిస్ మెహతా 2011లో రాజస్థాన్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2023లో గౌహతి సీజేగా పదోన్నతి లభించింది. అదే ఏడాది నవంబరులో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు, జస్టిస్ శర్మ రాజస్థాన్ హైకోర్టు జడ్జిగా 2016లో నియమితులయ్యారు.
ఆరోపణల నిగ్గు తేలుస్తాం: సీజేఐ
జస్టిస్ సందీప్ మెహతా ఆరోపణలపై సీజేఐ సూర్యకాంత్ స్పందిస్తూ.. సిట్టింగ్ జడ్జి మీద వచ్చిన ఆరోపణలను ఉనికిలో ఉన్న కచ్చితమైన సంస్థాగత ప్రక్రియల ద్వారా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అయితే, జస్టిస్ శర్మ మీద వచ్చిన ఆరోపణలనే వాస్తవాలుగా పరిగణించబోమని, ఆయన స్పందించేందుకు తగిన అవకాశం కల్పిస్తామన్నారు. ఈ మేరకు నాలుగు రోజుల జర్మనీ, బ్రిటన్ పర్యటనలో ఉన్న సీజేఐ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..