Sonam Wangchuk Detention: సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టును సవాలు చేస్తూ పిటిషన్.. సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 07:05 PM
లద్దాఖ్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై నేడు వాడీవేడిగా వాదనలు సాగాయి. సోనమ్ భార్య ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జాతీయ ఐక్యతకు పాటుపడ్డ వ్యక్తిని క్రిమినల్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోందని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
ఇంటర్నెట్ డెస్క్: లద్దాఖ్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర హోదా కోరుతూ లద్దాఖ్‌లో గతేడాది సెప్టెంబర్‌లో హింసాత్మక నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు మరణించగా, 90 మంది గాయాలపాలయ్యారు. ప్రజలను హింసాత్మక ఘటనల దిశగా రెచ్చగొట్టి, జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టారన్న ఆరోపణలతో పోలీసులు వాంగ్‌చుక్‌ను సెప్టెంబర్ 26న జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. దీన్ని సవాలు చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి గతేడాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ నేడు కోర్టులో వాదనలు వినిపించారు (SC Hearing on Wangchuk Detention Under NSA).
కొన్ని వీడియోలను ఆధారాలుగా పేర్కొంటూ వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకున్నారని కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆ వీడియోలను ఇప్పటికీ తమకు అందించలేదని, తమ వాదనను వినిపించే అవకాశం ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆర్టికల్ 22(5) ప్రకారం వాంగ్‌చుక్ నిర్బంధం చెల్లదని చెప్పారు. రాష్ట్ర హోదా కోరుతూ సెప్టెంబర్ 10న వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ప్రారంభించారని చెప్పారు. సెప్టెంబర్ 24న హింసాత్మక ఘటనలు జరిగాయి. దీన్ని వ్యతిరేకిస్తూ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించారని సిబల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హింసకు సమాజంలో చోటు లేదని ఆ సందర్భంగా వాంగ్‌చుక్ ప్రసంగించారని తెలిపారు. కానీ ఆ తరువాత రెండు రోజులకు ఆయనను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
చౌరీచౌరా ఘటన తరువాత మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించినట్టుగానే వాంగ్‌చుక్ సెప్టెంబర్ 24న నిరాహార దీక్షను ముగించినట్టు చెప్పారు. అయితే, ఆయనతో దేశ భద్రతకు ముప్పు ఉందని చెబుతూ అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. దేశాభివృద్ధి పాటుపడి 30 అవార్డులను సొంతం చేసుకున్న వ్యక్తిని క్రిమినల్‌గా చూపిస్తున్నారని ఆరోపించారు.
హింసకు తావులేదంటూ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో అధికారుల వద్ద ఉన్నా బేఖాతరు చేశారని అన్నారు. నిరాహార దీక్ష చేయాలన్న నిర్ణయం వాంగ్‌చుక్ ఒక్కడిదే కాదని, అది వారి ఎన్‌జీఓ సంస్థ సభ్యులు తీసుకున్న సమిష్టి నిర్ణయమని గుర్తు చేశారు. వాంగ్‌చుక్‌ను నిర్బంధించే సమయంలో అధికారులు నాలుగు వీడియోలను ఆధారాలుగా చూపించారని, కానీ సెప్టెంబర్ 24న వాంగ్‌చుక్ ప్రసంగం తాలూకు వీడియో వారి వద్ద ఉన్నా డీటెయినింగ్ అధికారికి చూపించలేదని సిబల్ వాదించారు. తద్వారా కేసుకు సంబంధించిన అన్ని వివరాల ఆధారంగా వాంగ్‌చుక్‌ను నిర్బంధించాలా? వద్దా? అనేది డీటెయినింగ్ అధికారి నిర్ణయించలేకపోయారని అన్నారు. ఈ పిటిషన్‌పై సోమవారం కూడా విచారణ కొనసాగనుంది. లద్దాఖ్‌లో స్థానికులను హింసాత్మక ఘటనలకు వాంగ్‌చుక్ పురిగొల్పారని హోమ్ మంత్రిత్వ శాఖ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
ఈడీ రెయిడ్స్‌తో పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. ఐప్యాక్ చీఫ్ ఇంటికి సీఎం మమత
లోక్‌సభ దర్యాప్తు కమిటీ ఏర్పాటుపై జస్టిస్ వర్మ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు