Share News

సీఎం ఒమర్ అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేస్తాం: సుప్రీం కోర్టు

ABN , Publish Date - Jul 31 , 2026 | 03:10 PM

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు డైవర్స్ మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. భార్య పాయల్ అబ్దుల్లాతో అన్ని వివాదాలను పరిష్కరించుకున్నట్టు సీఎం కోర్టుకు తెలపడంతో ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

సీఎం ఒమర్ అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేస్తాం: సుప్రీం కోర్టు
Omar Abdullah Divorce

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్‌కు విడాకులు మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు తాజాగా అంగీకరించింది. భార్య పాయల్ అబ్దుల్లాతో వివాదాలను పరిష్కారించుకున్నట్టు ఒమర్ అబ్దుల్లా తెలపడంతో జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం విడాకులు మంజూరు చేస్తామని తెలిపింది. ఆ భార్యాభర్తలు తమ మధ్య వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారని సీఎం తరఫు లాయర్ కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. అన్ని అంశాలను సెటిల్ చేసుకున్నారని చెప్పారు. దీంతో, సుప్రీం కోర్టు ధర్మాసనం వారికి విడాకులు మంజూరు చేస్తామని తెలిపింది.


ఒమర్, పాయల్‌లు 1994లో వివాహం బంధంలో అడుగుపెట్టారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2011లో తాను భార్యతో విడిపోతున్నట్టు ఒమర్ అబ్దుల్లా బహిరంగంగా ప్రకటించారు. తమ బంధం శాశ్వతంగా తెగిపోయిందంటూ ఒమర్ డైవర్స్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, 2016లో ఫ్యామిలీ కోర్టు ఒమర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ఒమర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కూడా తోసిపుచ్చింది. తన భార్య మానసిక వేదనకు గురిచేసిందన్న ఒమర్ అరోపణను కోర్టు తోసిపుచ్చింది. ఇందుకు తగిన ఆధారాలను ఆయన చూపించలేకపోయారని పేర్కొంది. ఈ క్రమంలో కేసు సుప్రీం కోర్టుకు చేరింది. అయితే, భార్యాభర్తలు ఇద్దరూ తమ మధ్య వివాదాలను సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నించుకోవాలని గతేడాది సుప్రీం కోర్టు సూచించింది. తాజాగా వారికి విడాకులు మంజూరు చేసేందుకు అంగీకరించింది.


ఈ వార్తలనూ చదవండి:

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా

భారత్‌కు జిన్‌పింగ్‌ రాక?.. బ్రిక్స్‌ సదస్సుకు హాజరయ్యే అవకాశం!

Updated Date - Jul 31 , 2026 | 04:07 PM