Share News

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా

ABN , Publish Date - Jul 31 , 2026 | 02:36 PM

భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీ వీడారు. తాజాగా, తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో షెహజాద్ బీజేపీని వీడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా
Shehzad Poonawalla

న్యూఢిల్లీ, జులై 31: భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీ వీడారు. తాజాగా, తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో షెహజాద్ బీజేపీని వీడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాజీనామా నేపథ్యంలో ఆయన గురువారం తన ఎక్స్ ఖాతాలో బయో వివరాలు మార్చేశారు. ‘జాతీయ అధికార ప్రతినిధి’ హోదాను తొలగించారు. షెహజాద్ పూనావాలా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా చాలా యాక్టీవ్‌గా ఉండేవారు. బీజేపీ తరఫున తరచుగా టీవీ డిబేట్లలో పాల్గొనేవారు.


2017లో బీజేపీలోకి..

షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన 2017లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను బహిరంగంగా వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీని ఎన్నుకునే ప్రక్రియ అంతా ఒక నాటకమని, అది ముందే ఖరారైన వ్యవహారమని షెహజాద్ పూనావాలా తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, అర్హత ఆధారంగా కాకుండా కేవలం కుటుంబ నేపథ్యం ఆధారంగానే పదవులు ఇస్తున్నారని విమర్శించారు.


రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేసిన తర్వాతే నిష్పక్షపాతంగా ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ ఆయనకు జాతీయ అధికార ప్రతినిధి పదవిని కల్పించింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చేశారు. అయితే, ఆయన ఏ కారణాలతో పార్టీని వీడారన్నది అధికారికంగా తెలియరావాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి

భారత్‌కు జిన్‌పింగ్‌ రాక?.. బ్రిక్స్‌ సదస్సుకు హాజరయ్యే అవకాశం!

గోదావరి వరద ఉధృతి.. అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ హెచ్చరిక

Updated Date - Jul 31 , 2026 | 02:47 PM