రోడ్డు ఉంటే నడక దారీ ఉండాలి
ABN , Publish Date - Aug 04 , 2026 | 05:39 AM
ఆక్రమణలకు గురికాని, పూర్తిగా వేరుపరిచిన స్థలాన్ని ప్రతి రహదారి పక్కన పాదచారుల కోసం ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నడక దారి ఎట్టిపరిస్థితుల్లోనూ కబ్జాకు...
అది పాదచారుల ప్రాథమిక హక్కు
వాహన మార్గానికి విడిగా ఉండాలి
ఆక్రమణ జరగకుండా చూడాలి
భారీ ఖర్చు, నిర్మాణాలు అక్కర్లేదు
ఫుట్‌పాత్ లేనిచోట తాడు చాలు
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రెండు వారాల్లో స్పందించాలని కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ, ఆగస్టు 3 : ఆక్రమణలకు గురికాని, పూర్తిగా వేరుపరిచిన స్థలాన్ని ప్రతి రహదారి పక్కన పాదచారుల కోసం ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నడక దారి ఎట్టిపరిస్థితుల్లోనూ కబ్జాకు గురి కారాదని, మోటారు వాహనాల దారికి అది విడిగా ఉండాలని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలక్ ఆరాధేలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ‘‘రహదారి ఉందంటే పాదచారుల నడక దారి కూడా ఉన్నట్టే. దీనికోసం పెద్దఎత్తున డబ్బులు ఖర్చుపెట్టి, భారీగా నిర్మాణాలేమీ చేయక్కర్లేదు. రహదారి నుంచి నడక స్థలాన్ని వేరుచేసే ఏర్పాటు ఉంటే సరిపోతుంది. ఆ స్థలం దురాక్రమణకు గురి కాలేదని చెప్పడానికి చిన్న తాడు అక్కడ కట్టినా చాలు’’ అని బెంచ్ వ్యాఖ్యానించారు. కదిలే వాహనాల మధ్య చిక్కుకుపోతామనే భయం లేకుండా పాదచారులు నిర్భయంగా నడిచేందుకు అన్ని చర్యలూ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు వారాల్లో సంబంధిత విభాగాల అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని అడిషినల్ సొలిసిటర్ జనరల్ కేఎమ్ నరరాజ్‌ను కోరింది. ఈ విషయంలో పట్టణాభివృద్ధి విభాగాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీ యంత్రాంగాలదే బాధ్యత అని, బాధితులకు ఈ వ్యవస్థల నుంచి పరిహారం కోరే పూర్తి హక్కు ఉన్నదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల కుమారుడిని కోల్పోయిన తండ్రికి పరిహారం విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈ ఏడాది జూన్ 19న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రహదారి నుంచి పూర్తిగా వేరుపరిచిన ఫుట్‌పాత్‌పై నడక పాదచారుల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. దీనిపై అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటల్ జనరల్ విచారణకు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..