ఒక జట్టు కెప్టెనే అంపైర్‌ను ఎంపిక చేసుకున్నట్లుంది!
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:05 AM
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) తప్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టంపై విచారణ సందర్భంగా.. జస్టిస్ దీపాంకర్ దత్తా ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి
సీఈసీ, ఈసీల ఎంపిక
ప్యానెల్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) తప్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టంపై విచారణ సందర్భంగా.. జస్టిస్ దీపాంకర్ దత్తా ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి పిటిషన్లను నివేదించాలన్న కేంద్రం వాదనను జస్టిస్ దత్తా అంగీకరించలేదు. జస్టిస్ దత్తా అభిప్రాయాలతో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ విభేధించారు. భిన్నాభిప్రాయాల నేపథ్యంలో సముచిత నిర్ణయం కోసం ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముందుంచాలని ధర్మాసనం నిర్ణయించింది. అలాగే, ఇలాంటి కీలకమైన రాజ్యాంగపరమైన అంశాలపై విచారించడానికి ఐదుగురు సభ్యులతో ఒక శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటును పరిశీలించాలని సీజేఐని కోరింది. ఈ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఒక జట్టు కెప్టెనే అంపైర్‌ను ఎంపిక చేశాడని అనుకుందాం. ఆ అంపైర్ తీసుకున్న నిర్ణయాలన్నీ సరైనవే అయినప్పటికీ.. చివరికి అతన్ని ఎంపిక చేసిన జట్టే గెలిస్తే, అంపైర్‌పై అనుమానం రాదా’’అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు 2023 మార్చి 2న చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐతో కూడిన కమిటీ సిఫారసుల ఆధారంగానే సీఈసీ, ఈసీల నియామకంపై రాష్ట్రపతి నిర్ణయంతీసుకోవాలని ఆదేశించింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా అదే ఏడాది డిసెంబరులో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. చీఫ్ జస్టిస్ ను ప్యానెల్ నుంచి తప్పించింది.
ఈ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ బెంచ్ ఐదు రోజులపాటు విచారణ చేపట్టింది. ‘‘కమిటీలో మూడో సభ్యుడిగా ఉండే మంత్రి ప్రధాని అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తారే కానీ, స్వతంత్రంగా వ్యవహరించలేరు’’అని జస్టిస్ దత్తా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో.. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమిస్తారనే వాదనను తోసిపుచ్చారు.
ఇవి కూడా చదవండి
యువతకు విదేశాల్లో జాబ్స్.. కేంద్రం 'గ్లోబల్ స్కిల్డ్ జాబ్ మ్యాపింగ్'!
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ