Share News

బ్రోచర్లో చూపినవి ఇవ్వాల్సిందే

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:42 AM

ఇల్లు కొనేవారికి బ్రోచర్‌లో చూపించిన ప్లాన్‌ను, హామీలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవి కేవలం మార్కెటింగ్‌లో భాగంగా ఇచ్చిన ప్రకటనలని చెప్పి తప్పించుకోలేరని తేల్చిచెప్పింది.

బ్రోచర్లో చూపినవి ఇవ్వాల్సిందే
SUPREMECOURT

  • కట్టిన ఇంటికి, ఇచ్చిన ప్లాన్‌కు పొంతన ఉండాల్సిందే

  • అవి కేవలం ప్రకటనలని చెప్పి తప్పించుకోలేరు

  • డీఎల్‌ఎఫ్‌ కేసులో బిల్డర్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక

    న్యూఢిల్లీ, సెప్టెంబరు 3: ఇల్లు కొనేవారికి బ్రోచర్‌లో చూపించిన ప్లాన్‌ను, హామీలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవి కేవలం మార్కెటింగ్‌లో భాగంగా ఇచ్చిన ప్రకటనలని చెప్పి తప్పించుకోలేరని తేల్చిచెప్పింది. గురుగ్రామ్‌లో డీఎల్‌ఎఫ్‌ సంస్థ చేపట్టిన అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్లాన్‌లో, బ్రోచర్‌లో చూపించినట్లుగా 24 మీటర్ల రోడ్డు వేయలేదని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ విచారణ బృందం గుర్తించింది. ప్లాన్‌లో రోడ్డు కోసం కేటాయించిన స్థలంలో మూడింట రెండు వంతులు లాన్‌ కోసం, కార్ల పార్కింగ్‌ కోసం ఉపయోగిస్తున్నారని సీబీఐ విచారణ బృందం నివేదించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇది చిన్న మార్పు కాదని, ప్లాన్‌కు అనుగుణంగా మార్చాల్సిందేనని స్పష్టం చేసింది. లేదంటే తాము చర్య తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.


2012లో నిర్మాణం మొదలు పెట్టిన డీఎల్‌ఎఫ్‌ 2016లో గడువులోగా కొనుగోలుదారులకు అప్పగించలేక పోయింది. దానిపై కొనుగోలుదారులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. 24 మీటర్ల రెండు రోడ్లను ఇస్తామని చెప్పి ఒక్క రోడ్డుతో సరిపుచ్చారని, స్విమ్మింగ్‌ పూల్‌ సహా పలు సౌకర్యాలు బ్రోచర్‌లో చూపించి నిర్మాణంలో ఎత్తేశారని ఫిర్యాదు చేశారు. వారికి అనుకూలంగా ఫోరం తీర్పు ఇచ్చింది. దాంతో డీఎల్‌ఎఫ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డీఎల్‌ఎఫ్‌ అనేక హామీలను అమలు చేయలేదని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తించింది. ఇది ఒక్క డీఎల్‌ఎఫ్‌ సమస్య కాదని, దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై సీబీఐ ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఆదేశించింది. బ్రోచర్లలోని అంశాలను అమలు చేయాల్సిన హామీలుగానే పరిగణిస్తామని చెప్పింది

ఇవి కూడా చదవండి

తిలక్‌ అదిరెన్‌!

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

Updated Date - Sep 04 , 2026 | 05:54 AM