ఐఏఎస్ హత్య కేసు.. బిహార్ మాజీ ఎంపీ ముందస్తు విడుదల రద్దు
ABN , Publish Date - Nov 26 , 2026 | 01:29 PM
ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ బిహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ ముందస్తు విడుదలను సుప్రీం కోర్టు తాజాగా రద్దు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ బిహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ ముందస్తు విడుదలను సుప్రీం కోర్టు తాజాగా రద్దు చేసింది. 2023లో బిహార్ ప్రభుత్వం ఆయన శిక్షను కుదించి ముందస్తుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా అప్పట్లో ప్రభుత్వం జైలు నిబంధనల్లో మార్పులు చేసింది. అయితే, ఈ మార్పులు చట్టప్రకారం సమర్థనీయం కాదని, చెల్లవని సుప్రీం కోర్టు గురువారం తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి 2023లో బిహార్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. జైలు అధికారులకు లొంగిపోవాలని మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను ఆదేశించింది.
మాజీ ఎంపీ విడుదలను సవాలు చేస్తూ దివంగత ఐఏఎస్ అధికారి భార్య ఉమాదేవి దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. శిక్ష తగ్గింపునకు సంబంధించి 2002 నాటి నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగుల హత్య కేసుల్లో దోషులకు ముందస్తు విడుదలకు అవకాశం లేదు. అయితే, మాజీ ఎంపీ విడుదలకు వీలుకలిగేలా ఈ నిబంధనను తొలగిస్తూ బిహార్ ప్రభుత్వం 2023లో మార్పులు చేసింది. దీన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అకస్మాత్తుగా, ప్రత్యేకంగా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతమాత్రం సమర్థనీయం కాదని తెలిపింది. ఈ మార్పునకు హేతుబద్ధమైన, సమర్థనీయమైన కారణం చూపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. ఫలితంగా 2023 నాటి రూల్స్ రాజ్యాంగ విరుద్ధంగా మారాయని, ఆర్టికల్ 21ను ఉల్లంఘించాయని స్పష్టం చేసింది.
ఆనంద్ మోహన్ శిక్ష తగ్గింపు అంశాన్ని మరోసారి పరిశీలించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే, ఆనంద్ మోహన్ సరెండర్ అయిన నెల రోజుల తరువాతే ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో తన వాదనలు వినిపించుకునేందుకు మాజీ ఎంపీకి అవకాశం ఉంటుందని కూడా చెప్పింది.
సత్యాన్వేషణయే కోర్టు బాధ్యత అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు ఇష్టారీతిన తీసుకునే నిర్ణయాలకు చెక్ పెట్టేందుకు కోర్టులు న్యాయసమీక్ష జరుపుతాయని తెలిపింది. తామ మౌన ప్రేక్షకులుగా ఉండబోమని స్పష్టం చేసింది. 1994లో గోపాల్‌గంజ్ మెజిస్ట్రేట్‌గా చేస్తున్న సమయంలో ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ట్రయల్ కోర్టు మాజీ ఎంపీని దోషిగా తేలుస్తూ 2007లో మరణ శిక్ష విధించింది. 2008లో పట్నా హైకోర్టు ఆయన మరణశిక్షను యావజ్జీవంగా మార్చింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు 2012లో సమర్థించింది.
ఈ వార్తలనూ చదవండి:
చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం.. కోర్టును ఆశ్రయించనున్న టాటా ట్రస్టులు
మలుపు తిరిగిన కార్తీక దీపం వివాదం.. ఆలయ ప్రకటనతో సంబంధం లేదన్న పూజారులు