చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం.. కోర్టును ఆశ్రయించనున్న టాటా ట్రస్టులు
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:20 PM
టాటా సంస్థల హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు చైర్మన్‌గా చంద్రశేఖరన్ పునర్ నియామకంపై వివాదం మరో మలుపు తిరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: టాటా సంస్థల హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు చైర్మన్‌గా చంద్రశేఖరన్ పునర్ నియామకంపై వివాదం మరో మలుపు తిరిగింది. టాటా సన్స్ ట్రస్టుల్లో ముఖ్యవాటాదారుడైన నోయెల్ టాటా మొదటి నుంచీ చంద్రశేఖరన్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించేందుకు ఆయన సారథ్యంలోని టాటా ట్రస్టులు తీర్మానించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. టాటా సన్స్‌తో పాటు అందులోని ఆరుగురు డైరెక్టర్ల నిర్ణయాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేసేందుకు నిర్ణయించాయి.
సర్ దొరాబ్జీ టాటా ట్రస్టు, ఆర్‌డీ టాటా ట్రస్టు ఈ మేరకు తిర్మానించినట్టు సమాచారం. చంద్రశేఖరన్‌ను టాటా సన్స్ చైర్మన్‌గా మళ్లీ నియమిస్తూ సెప్టెంబర్ 17న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే, ఈ విషయంలో టాటా సన్స్, టాటా ట్రస్టులు అధికారికంగా ఇంకా స్పందించలేదు.
చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకంపై టాటా సంస్థల హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్, నోయెల్ టాటా నేతృత్వంలోని టాటా ట్రస్టుల మధ్య సెప్టెంబర్ 17 నుంచి వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం టాటా సంస్థల్లో నోయెల్ టాటా అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. టాటా సంస్థ యాజమాన్యం వ్యవస్థ విషయంలో కూడా టాటా సన్స్, టాటా ట్రస్టుల బోర్డు మెంబర్ల మధ్య వివాదం నెలకొంది. టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీ పబ్లిక్ లిస్టింగ్‌కు వెళ్లాలా? వద్దా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. టాటా సన్స్‌ను ప్రైవేటు లిమిటెడ్ సంస్థగానే ఉంచాలని నోయెల్ టాటా పట్టుబడుతున్నారు. ఈ అంశంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ వివాదం స్నేహపూర్వకంగా పరిష్కారం కావాలని ఆకాక్షించారు.
ఈ వార్తలను చదవండి:
26/11 ముంబయి ఉగ్రదాడులకు 18 ఏళ్లు.. నివాళులర్పించిన విదేశాంగ మంత్రి జైశంకర్