‘సర్’ ఓట్ల తేడాపై మళ్లీ పిటిషన్లు వేసుకోవచ్చు
ABN , Publish Date - May 12 , 2026 | 05:34 AM
పశ్చిమబెంగాల్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ద్వారా ఓట్లు తొలగించిన వ్యవహారంలో మమతా బెనర్జీ, ఇతరులు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ...
మమత, ఇతరులకు సుప్రీం కోర్టు అవకాశం
న్యూఢిల్లీ, మే 11: పశ్చిమబెంగాల్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ద్వారా ఓట్లు తొలగించిన వ్యవహారంలో మమతా బెనర్జీ, ఇతరులు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. తాజాగా మళ్లీ పిటిషన్లు వేసేందుకు వారికి అత్యున్నత న్యాయస్థానం అవకాశం కల్పించింది. 31 అసెంబ్లీ స్థానాల్లో సర్‌లో తొలగించిన ఓట్ల కంటే గెలుపు మార్జిన్ తక్కువగా ఉందని, దీనివల్ల తమకు నష్టం జరిగిందన్న టీఎంసీ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కాగా, గెలుపు మార్జిన్ తొలగించిన ఓట్ల కంటే తక్కువుగా ఉంటే అప్పుడు కోర్టు పరిశీలిస్తుందని గతంలోనే న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి వ్యాఖ్యానించారు. అదే విషయాన్ని సోమవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి ధర్మాసనం ముందు టీఎంసీ ఎంపీ, సీనియర్ అడ్వొకేట్ కళ్యాణ్ బెనర్జీ ప్రస్తావించారు. ఓ నియోజకవర్గంలో 5,550 ఓట్లను తొలగించారని, అక్కడ తమ అభ్యర్థి 862 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి స్థానాలు 31 ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ, టీఎంసీల మధ్య మొత్తం ఓట్ల తేడా 32 లక్షలు ఉండగా, తొలగించిన ఓట్లపై 35 లక్షలకుపైగా పిటిషన్లు వచ్చాయన్నారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం తాజాగా పిటిషన్లు దాఖలు చేయవచ్చని చెప్పింది.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్