Share News

న్యాయమూర్తులకు సహనం ఉండాలి!

ABN , Publish Date - May 12 , 2026 | 05:55 AM

న్యాయమూర్తులు న్యాయవాదుల పట్ల సహనం పాటించాలని.. యువన్యాయవాదులకు తగిన ప్రోత్సాహం అందించాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో...

న్యాయమూర్తులకు సహనం ఉండాలి!

యువ న్యాయవాదులను ప్రోత్సహించాలి..

ఏపీ హైకోర్టులో వివాదంపై సుప్రీంకోర్టు హితవు

  • హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌, బార్‌ జోక్యంతో సమస్య పరిష్కారం

  • ఇక మా స్థాయిలో ఆదేశాలు అక్కర్లేదు

  • సీజేఐ ధర్మాసనం

న్యూఢిల్లీ, మే 11 (ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తులు న్యాయవాదుల పట్ల సహనం పాటించాలని.. యువన్యాయవాదులకు తగిన ప్రోత్సాహం అందించాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్‌ రాజశేఖర్‌రావు ఒక యువ న్యాయవాదిని పోలీసు కస్టడీకి పంపిస్తానని హెచ్చరించిన ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్పందించింది. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌, అక్కడి బార్‌ అసోసియేషన్‌ జోక్యంతో సమస్య సామరస్యంగా పరిష్కారమైనందువల్ల సుప్రీంకోర్టు స్థాయిలో ఎలాంటి ఆదేశాలూ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. యువ న్యాయవాది కోపంతో పోడియంపై ఫైళ్లను విసిరేశారన్న ఉద్దేశంతో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారే తప్ప.. ఆయన్ను కస్టడీలోకి తీసుకోవాలని లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేయలేదని గుర్తుచేసింది. ఈ అంశాన్ని ఇక తెగేవరకూ లాగకూడదని అభిప్రాయపడింది. ‘అన్ని స్థాయుల్లో న్యాయమూర్తులు అందరి పట్లా సహనం, దయాభావం, ప్రోత్సాహ స్ఫూర్తి ప్రదర్శించాలి. క్రమశిక్షణ, వృత్తిపరమైన నైతికత, నిరంతర అధ్యయనం బార్‌ సీనియర్‌ సభ్యుల విద్యుక్త ఽధర్మం. ధర్మాసనం కూడా విద్యుక్త ధర్మం, నిజాయితీ పాటించాలి’ అని తెలిపింది. బార్‌ కౌన్సిళ్లు, బార్‌ అసోసియేషన్ల సభ్యులతో కలిసి సమస్యల పరిష్కారానికి కమిటీల ఏర్పాటు అవసరమని. దీనివల్ల సకాలంలో వివాదాలను పరిష్కరించుకోవచ్చని హైకోర్టులకు సూచించింది. సందర్భం గురించి వివరించకుండా కోర్టు విచారణకు సంబంధించిన ఎడిటెడ్‌ వీడియోక్లి్‌పలను ప్రచారం చేసే విషయంలో మీడియా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మీడియాకు కూడా బాధ్యత ఉందని, క్రియాశీల పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఏపీ హైకోర్టులో ఈ నెల 4న జస్టిస్‌ రాజశేఖర్‌రావు ఒక న్యాయవాదిని పోలీసు కస్టడీకి పంపిస్తానని హెచ్చరించడాన్ని గర్హిస్తూ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీర్మానాలు చేయడమే కాక సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

ఇవి కూడా చదవండి..

మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..

సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్

Updated Date - May 12 , 2026 | 05:55 AM