Share News

‘ఎల్‌నినో’తో గట్టి దెబ్బ!

ABN , Publish Date - May 07 , 2026 | 07:23 AM

పసిఫిక్‌ మహా సముద్రంలో ‘సూపర్‌ ఎల్‌నినో’ భూతం మేల్కొంది. వర్షాభావం, వడగాడ్పులు, కరువు పరిస్థితులతో గోసపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకదాని ప్రభావం మరొకదానిపై గొలుసుకట్టులా...

‘ఎల్‌నినో’తో గట్టి దెబ్బ!

పసిఫిక్‌ మహా సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులు మొదలు..

ఇది ‘సూపర్‌ ఎల్‌నినో’ అంటున్న వాతావరణ శాస్త్రవేత్తలు

  • దక్షిణాసియాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు

(సెంట్రల్‌ డెస్క్‌)

పసిఫిక్‌ మహా సముద్రంలో ‘సూపర్‌ ఎల్‌నినో’ భూతం మేల్కొంది. వర్షాభావం, వడగాడ్పులు, కరువు పరిస్థితులతో గోసపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకదాని ప్రభావం మరొకదానిపై గొలుసుకట్టులా ప్రభావం చూపి వ్యవసాయం, విద్యుత్‌, పారిశ్రామిక, ఇతర రంగాలన్నింటిపైనా ప్రభావం పడనుంది. ఈసారి ఎల్‌నినో పీడ తప్పదని ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కేంద్రాలు ఇప్పటికే అంచనా వేశాయి. తాజాగా పసిఫిక్‌ తూర్పు, మధ్య ప్రాంతాల్లో ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం(ఇన్‌కాయి్‌స) వెల్లడించింది. మే మధ్యలో మొదలై వచ్చే ఏడాది జనవరి చివరి వరకు దీని ప్రభావం ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు ఈసారి 2027 చివరి వరకు కొనసాగవచ్చని అమెరికా, చైనా, జపాన్‌ వాతావరణ విభాగాలు అంచనా వేశాయి. సాధారణంగా ప్రతి రెండు నుంచి ఏడేళ్లకోసారి ఎల్‌నినో ఏర్పడుతుంది. ఎప్పుడూ సాధారణ వర్షాలు కురిసే చోట కరువు ఏర్పడితే.. ఎప్పుడూ వర్షాభావం ఉండే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఉదాహరణకు ఎల్‌నినో ఏర్పడితే ఇండోనేషియాలో పడాల్సిన వర్షమంతా.. కాస్త దూరంలో సముద్రంపై కురుస్తుంది. భారత్‌లోనూ ఇదే తరహాలో వర్షాలు కురిసే తీరు మారిపోతుంది. మరోవైపు దక్షిణ, ఉత్తర అమెరికా ఖండాల్లో తుఫానులతో వరదలు వస్తాయి. 2015-16, 2019-20 సమయంలో ఏర్పడిన ఎల్‌నినోతో ఆస్ట్రేలియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. గణాంకాల నమోదు ప్రారంభమైన నాటి నుంచి 1997-98 ఎల్‌నినో అత్యంత తీవ్రమైనదని.. దానితో ఆస్ట్రేలియా, ఆసియా ఖండాల్లో కరువు పరిస్థితులు ఏర్పడితే.. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.


ఇది సూపర్‌ ఎల్‌నినో..!

ఈసారి ఎల్‌నినో తీవ్రస్థాయిలో ఉండవచ్చని, దానిని ‘సూపర్‌ ఎల్‌నినో’గా చెప్పవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈసారి 1997-98 నాటి తరహాలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేశారు. దానికితోడు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణాసియాలో నైరుతి, ఈశాన్య రుతుపవనాలు ఈసారి బలహీనంగా ఉండవచ్చని.. సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేశారు. కాగా, దక్షిణ తెలంగాణకు ఎల్‌ నినో ముప్పు ఉంటుందని, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నారాయణపేట్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ వంటి జిల్లాలపై ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్ని రంగాలకూ ప్రమాదమే!

అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంటుంది. వానలు లేక జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయి ఇబ్బంది ఎదురవుతుంది. జలవిద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. మరోవైపు వ్యవసాయం కోసం బోర్ల వినియోగం పెరగడం, గృహాలు, పరిశ్రమల్లో చల్లదనం, ఇతర అవసరాల కోసం విద్యుత్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. సరిపడా విద్యుత్‌ అందుబాటులో లేకుంటే కరెంటు కోతలు తప్పవు. మొత్తంగా ఈ పరిణామాలు పారిశ్రామిక, ఇతర రంగాలపైనా ప్రభావం చూపుతాయి. పొడి వాతావరణం, వేడి కారణంగా అడవుల్లో కార్చిచ్చులు చెలరేగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

Updated Date - May 07 , 2026 | 07:27 AM