Share News

పళనిస్వామి వ్యాఖ్యలతో తమిళనాట దుమారం.. ఖండించిన సీఎం స్టాలిన్

ABN , Publish Date - Apr 04 , 2026 | 06:51 PM

ఏఐఏడీఎమ్‌కే చీఫ్ పళనిస్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్‌ను సీఎం స్టాలిన్ ఖండించారు.

పళనిస్వామి వ్యాఖ్యలతో తమిళనాట దుమారం.. ఖండించిన సీఎం స్టాలిన్
Stalin vs Palaniswami,

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. ఏఐఏడీఎమ్‌కే చీఫ్ పళనిస్వామి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పళనిస్వామి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తన తండ్రి సింహం లాంటి వారని అన్నారు.

డీఎమ్‌కే అధినేత కరుణానిధి తన చివరి రోజుల్లో తనయుడు స్టాలిన్ చేతిలో బందీగా మారారంటూ పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కృష్ణగిరిలో జరిగిన ఓ ర్యాలీలో పళనిస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన (స్టాలిన్) తన తండ్రినే బందీగా మార్చారు. ఇక రాష్ట్ర ప్రజలతో ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోండి’ అని అన్నారు. ‘డీఎమ్‌కే ఎంపీ రాజా స్వయంగా ఈ విషయాలను పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలిసిన విషయాలే’ అని అన్నారు.


ఈ కామెంట్స్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. పళనిస్వామి ఆరోపణలను తోసిపుచ్చారు. ‘నా తండ్రి చివరి రోజులను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారంటే వారిలో అసహనం ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వారికి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ముఖ్య కారణాలు ఏవీ లేక ఇంతలా దిగజారారు’ అని స్టాలిన్ మండిపడ్డారు. ఎంపీ రాజా ఆడియో ఫైల్స్‌ను కూడా తోసిపుచ్చారు. అవన్నీ కల్పితాలని తేల్చి చెప్పారు. పళనిస్వామి ఓటమి భయంతో ఉన్నారని అన్నారు. ఈ భయంతోనే అన్ని హద్దులూ దాటుతున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పళనిస్వామికి ఉన్నప్పటికీ తనకు తండ్రితో ఉన్న బంధాన్ని విమర్శించే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 04 , 2026 | 07:04 PM