20 నాటికి అండమాన్‌కు ‘నైరుతి’
ABN , Publish Date - May 09 , 2026 | 06:03 AM
ఈ నెల 20వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. రెండవ వారం చివరకు దక్షిణ బంగాళాఖాతం...
న్యూఢిల్లీ, మే 8: ఈ నెల 20వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. రెండవ వారం చివరకు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల ప్రవేశం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది రుతుపవన సీజన్ (జూన్-సెప్టెంబరు)లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో 92 శాతంగా ఉంటుందని ఐఎండీ ఇంతకు ముందటి అంచనాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాన పంటల నాట్లు వేసే కాలంలో పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం వినియోగం, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా, బంగాళాఖాతం నుంచి ఈశాన్య భారతదేశం వరకు దిగువ, మధ్య ట్రోపోస్ఫెరిక్ స్థాయిల్లో ఈ వారంలో నైరుతి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మొత్తంగా.. దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు, ఈశాన్య భారతంలో సాధారణం కంటే అధిక వర్షపాతం, పశ్చిమ హిమాలయన్ రీజియన్‌లో సాధారణం కంటే తక్కువ, దేశంలోని మిగతా చోట్ల దాదాపు సాధారణ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు కీలకమైన ఖరీఫ్ సీజన్‌లో వరి, పత్తి, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి పంటలను సాగు చేస్తారు. ఈ క్రమంలో నైరుతి వర్షపాత విస్తరణ, వానలు పడే సమయం అనేవి చాలా కీలకం.
ఇవి కూడా చదవండి...
పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం
కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం