ఆత్మకథను అందుకే రాశాను: సోనియా గాంధీ
ABN , Publish Date - Nov 16 , 2026 | 09:40 PM
తన ఆత్మకథను ఎందుకు రాయాల్సి వచ్చిందో కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ తాజాగా వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: తన ఆత్మకథను ఎందుకు రాయాల్సి వచ్చిందో కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ తాజాగా వివరించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్, ప్రియాంకల గురించి వాస్తవదూరమైన విషయాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయని సోనియా గాంధీ చెప్పారు. వాస్తవమేంటో ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే తన మనసులోని మాటకు ఆక్షర రూపం ఇచ్చినట్టు వివరించారు. బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ ఆవిష్కరణ సందర్భంగా ఎంపీ సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు.
తన ప్రయాణాన్ని తరచి చూసుకున్నప్పుడు పదే పదే బిలాంగింగ్ అనే పదం గుర్తుకు వచ్చిందని సోనియా గాంధీ తెలిపారు. తన కుటుంబం గురించి వ్యాప్తిలో ఉన్న కొన్ని కథనాల్లో బాధ కలిగించేవి కూడా ఉన్నాయని చెప్పారు. ఆ తప్పుల విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు తన అనుభవాలకు అక్షర రూపం ఇద్దామనుకున్నానని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తిలో ఉండటం సహజమేనని కూడా అభిప్రాయపడ్డారు. కాబట్టి, తన మనసులో మాటను ప్రజలు అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నట్టు చెప్పారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని తొలిసారి కలిసిన క్షణాల గురించి కూడా సోనియా గాంధీ చెప్పారు. మొదట్లో ఆమెను చూస్తే కొంత భయం వేసేదని అన్నారు. తన అత్త ఇందిరా గాంధీది దృఢమైన వ్యక్తిత్వమని చెప్పారు. అప్పుడప్పుడూ ఆమె కోపం చూస్తే భయం వేసేదని అన్నారు. తన తండ్రి గుర్తొచ్చేవారని తెలిపారు. అయితే, కాలం గడిచే కొద్దీ ఒకరిగురించి మరొకరికి తెలిశాక బంధం బలపడిందని అన్నారు. రాహుల్, ప్రియాంక పుట్టాక ఇందిరా గాంధీలో మరింత స్పష్టమైన మార్పు కనిపించిందని అన్నారు. అమ్మమ్మ అయ్యాక ఆమె మరింత సున్నితంగా వ్యవహరించే వారని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
బహ్రెయిన్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం