బహ్రెయిన్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం
ABN , Publish Date - Nov 15 , 2026 | 08:56 PM
గల్ఫ్ దేశాలలో ఏటా జరిగే శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవ వేడుకలు బహ్రెయిన్‌లో శుక్రవారం వైభవంగా జరిగాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఆంధ్రుల ఇష్టదేవత ఏడుకొండల వేంకటేశ్వరుడికి అరబ్బు ఎడారి దేశాలలో భక్తులు నీరాజనం పడుతున్నారు. గల్ఫ్ దేశాలలో ఏటా జరిగే శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవ వేడుకలు బహ్రెయిన్‌లో శుక్రవారం వైభవంగా జరిగాయి.
తిరుపతి నుంచి ప్రత్యేకంగా వచ్చిన అర్చకులు రాఘవాచార్యులు, శ్రీనివాసాచార్యులు, ఆర్. శ్రీనివాసన్ స్వామి, శ్రీనివాసమూర్తిల వేదమంత్రాలు, భక్తి కీర్తనలతో కల్యాణ వేదిక ఆధ్యాత్మిక శోభతో అలరారింది. బహ్రెయిన్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతర్ దేశాలలోని సుమారు 200 మందికి పైగా తెలుగు కుటుంబాలు కల్యాణోత్సవంలో పాల్గొనగా మరో వేయి మంది వరకూ స్వామివారి సేవలో తరించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో మొదలయిన కార్యక్రమం రాత్రి ఏకాంత సేవతో ముగిసే వరకూ స్వామిని కీర్తిస్తూ వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులు పరవశించిపోయారు. కల్యాణోత్సవంలో భారత రాయబారి ప్రదీప్ సింగ్ రాజ్ పురోహిత్, ఆయన సతీమణి మంజు కూడా పాల్గొన్నారు.

ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, సౌభగ్యం నెలకొనేందుకు శ్రీ వేంకటేశ్వరుడిని ప్రార్థించడానికి ఈ కల్యాణం నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తీతీదే చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఇ.ఓ ముద్దాడ రవిచంద్ర, జాయింట్ ఇ.ఓ డాక్టర్ ఏ. శరత్, ప్రాజెక్టు ఆఫీసర్ మేడసాని మోహన్, బండ్రిక్స్ సంస్థ చైర్మన్ దొరై స్వామి, ఏపీ ఎన్నార్టీ చైర్మన్ వేమూరు రాధాకృష్ణా, సి.ఇ.ఓ కృష్ణ మోహన్‌లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:
ఖతర్‌లో కమ్మని వేడుకగా కాకతీయ వనభోజనాలు