సోనియా గాంధీ ఆత్మకథను మేము ప్రచురించడం లేదు: పెంగ్విన్ ఇండియా
ABN , Publish Date - Aug 28 , 2026 | 04:06 PM
సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ను తాము ప్రచురించడం లేదని ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా తాజాగా పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ను తాము ప్రచురించడం లేదని ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా తాజాగా పేర్కొంది. పుస్తకంలో ఎడిటోరియల్ మార్పులకు కాంగ్రెస్ నేత అంగీకరించలేదన్న వార్తల నేపథ్యంలో పెంగ్విన్ ఇండియా ఈ ప్రకటన విడుదల చేసింది. ‘ఆ పుస్తకానికి మేము పబ్లిషర్ కాదు. పుస్తకంలో మార్పులకు సోనియా సిద్ధంగా లేకపోవడంతోనే మేము వెనక్కు తగ్గామన్న వార్తల్లో నిజం లేదు’ అని కూడా పెంగ్విన్ ఇండియా స్పష్టం చేసింది. అయితే, ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము ఉత్సుకతతోనే ఉన్నామని కూడా సంస్థ పేర్కొంది.
రచయితలు పేర్కొన్న వివరాల వెనకున్న వాస్తవాలను పరిశీలించి సూచనలు చేయడం తమ బాధ్యతని పెంగ్విన్ ఇండియా పేర్కొనడం గమనార్హం. ఇలాంటి సూచనలు, పరిశీలనలు తమ ప్రచురణ ప్రక్రియలో సర్వసాధారణమని కూడా సంస్థ తెలిపింది. చర్చల సందర్భంగా తాము పుస్తక ప్రచురణపై ఆసక్తితోనే ఉన్నట్టు కూడా చెప్పింది. రచయితలతో జరిపిన చర్చలను గోప్యంగా ఉంచుతామని, ఈ విషయంలో అంతకుమించి చెప్పేందుకు ఏమీ లేదని పెంగ్విన్ ఇండియా తేల్చి చెప్పింది.
సోనియా ఆత్మకథ ప్రచురణ నుంచి పెంగ్విన్ ఇండియా తప్పుకోవడంతో ఇతర పబ్లిషర్లు ముందుకు వచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మరో ప్రచురణ సంస్థ హార్పర్ కోలిన్స్‌తో డీల్ చివరి దశలో ఉన్నట్టు సమాచారం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యల తరువాత తన జీవితంలో పరిణామాల గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన ఆత్మకథలో పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు