అప్పటివరకూ దీక్ష కొనసాగిస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ABN , Publish Date - Jul 20 , 2026 | 08:42 PM
పార్లమెంటులో ఎంపీలను కలిసేందుకు తమ యూత్ లీడర్లను అనుమతించే వరకూ తన ఆమరణ దీక్ష కొనసాగుతుందని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మరో సందేశాన్ని విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంటులో ఎంపీలను కలిసేందుకు తమ యూత్ లీడర్లను అనుమతించే వరకూ తన ఆమరణ దీక్ష కొనసాగుతుందని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మరో సందేశాన్ని విడుదల చేశారు. వాంగ్‌చుక్ రాసిన చీటీని ఆయన భార్య గీతాంజలి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాన్కే కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన తరువాత సోనమ్ వాంగ్‌చుక్ ఈ సందేశాన్ని విడుదల చేశారు. ఆమరణ దీక్ష చేస్తున్న సోనమ్ ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
నేడు న్యూఢిల్లీలో జరిగిన నిరసనలపై వాంగ్‌చుక్ స్పందించారు. శాంతియుత నిరసనలు తెలుపుతున్న వారితో భద్రతా దళాలు క్రూరంగా వ్యవహరించడం చూశాక తాను దీక్షను కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్టు చెప్పారు. యూత్ లీడర్లు పార్లమెంటులో ఎంపీలను కలిసేందుకు అనుమతించే వరకూ లేదా ఆసుపత్రిలో తనను కలిసేందుకు వారిని అనుమతించే వరకూ ఈ దీక్ష కొనసాగుతుందని అన్నారు.
విద్యారంగంలో లోపాలకు విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకునేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందనే తాను ఆశిస్తున్నట్టు వాంగ్‌చుక్ తెలిపారు. ఎంతగా రెచ్చగొడుతున్నా యువత సంయమనం పాటించడం తనను కదిలించిందని అన్నారు. తమ సమస్యలను పార్లమెంటులో చెప్పుకునేందుకు యువతకు అవకాశం కల్పించి ఈ సమస్యకు కేంద్రం ముగింపు పలకాలని కోరారు. రేపు కూడా నిరసనకారులు ఇదే తరహా సంయమనంతో ఉండాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉంటే, వాంగ్‌చుక్‌కు సంబంధించి మెడికల్ రిపోర్టులు, ఇతర రికార్డులను తమకు సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని, ఎయిమ్స్, మరో ప్రైవేటు లేబోరేటరీని ఆదేశించింది. ఆసుపత్రి నుంచి వాంగ్‌చుక్ డిశ్చార్జ్ కుదరదని ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై కేంద్రం క్లారిటీ..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని మరింత పెంచుతారా? కేంద్రం ఏమందంటే..