Share News

పోలీసులతో వాంగ్‌చుక్ వాగ్వివాదం.. వైరల్‌గా మారిన సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వీడియో..

ABN , Publish Date - Jul 25 , 2026 | 02:45 PM

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌‌ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో పోలీసులతో వాగ్వివాదానికి దిగిన దృశ్యాల తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసులతో వాంగ్‌చుక్ వాగ్వివాదం.. వైరల్‌గా మారిన సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వీడియో..
Sonam Wangchuk

ఇంటర్‌నెట్ డెస్క్: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌‌ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో పోలీసులతో వాగ్వివాదానికి దిగిన దృశ్యాల తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి తనను బయటకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వాంగ్‌చుక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేలపై పడుకుని నిరసన తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. జంతర్‌మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు జులై 18వ తేదీన పోలీసులు బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనను మేదాంత ఆస్పత్రికి తరలించేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది.


హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వాంగ్‌చుక్ జులై 21వ తేదీన సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి మేదాంత ఆస్పత్రికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే, పోలీసులు ఆయనను అక్కడినుంచి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ వాంగ్‌చుక్ వాగ్వివాదానికి దిగారు. ‘వాళ్లను నన్ను అరెస్ట్ చేయమని చెప్పండి. మీరందరూ నన్ను వేధిస్తున్నారు. నేను ఒత్తిడితో చనిపోతే.. దానికి కారణం మీరే’ అంటూ వాంగ్‌చుక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దీనికి సమాధానం ఇస్తూ.. ‘మేము మిమ్మల్ని వేధించటం లేదు’ అని అన్నారు. ఆస్పత్రి డాక్టర్‌‌తో కూడా వాంగ్‌చుక్ వాగ్వివాదానికి దిగారు.


‘మీరు డాక్టరా? లేక కసాయి వ్యక్తా?’ అంటూ మండిపడ్డారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి మేదాంత ఆస్పత్రికి వెళ్లిన తర్వాత వాంగ్‌చుక్ ఓ వీడియా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో.. ‘వాళ్లు నన్ను అక్కడినుంచి రానివ్వలేదు. వాళ్ల ప్లాన్స్ ఏంటో నాకు తెలీదు. మా సామాన్లు మొత్తం సర్దుకున్న తర్వాత కూడా మూడు గంటల పాటు మమ్మల్ని అక్కడినుంచి బయటకు రానివ్వలేదు. నేను గొడవకు దిగాల్సి వచ్చింది. నేలపై పడుకుని నిరసన తెలపాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్: భారత్‌కు తొలి పతకం.. ఝండూ కుమార్‌కు మోదీ అభినందనలు

యూకే కేబినెట్‌లో భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు

Updated Date - Jul 25 , 2026 | 03:09 PM