యూకే కేబినెట్‌లో భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:23 PM
యూకే ప్రధాని ఆండీ బర్న్‌హామ్ తాజాగా నూతన మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఈసారి కేబినెట్‌లో భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
ఇంటర్నెట్ డెస్క్: యూకే ప్రధాని ఆండీ బర్న్‌హామ్ తాజాగా నూతన మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఈసారి కేబినెట్‌లో భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు. భారత సంతతికి చెందిన కనిష్క నారాయణ్‌కు కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కింది. ఆయనకు ప్రభుత్వం ఏఐ శాఖ బాధ్యతలను కేటాయించింది. కీర్ స్టార్మర్ మంత్రివర్గంలో సాంస్కృతిక శాఖ బాధ్యతలు నిర్వహించిన లీసా నాండీని ప్రధాని బర్న్‌హామ్ కేబినెట్‌లోకి తీసుకున్నారు. మునుపటి శాఖనే ఆమెకు కేటాయించారు. మహిళ శిశు సంరక్షణ, భద్రత సమానత్వం వ్యవహారాల బాధ్యతలు మరో భారత సంతతి నేత సత్వీర్ కౌర్‌కు దక్కాయి. ఇక హర్‌ప్రీత్ ఉప్పల్‌ను అసిస్టెంట్ గవర్న్‌మెంట్ విప్‌గా ప్రధాని నియమించారు.
ఎవరీ కనిష్క్..
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన కనిష్క నారాయణ్ 12 ఏళ్ల వయసులో కుటుంబంతో కలిసి యూకేకు వెళ్లారు. ఈటన్ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డు యూనివర్సిటీల్లో చదువుకున్నారు. 2024లో లేబర్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్‌లో అండర్‌సెక్రటరీగా సేవలందించారు. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ శాఖ బాధ్యతల ఆయనకు దక్కాయి. వాణిజ్యం, సైన్స్ అండ్ ట్రేడ్ శాఖ బాధ్యతలు కూడా ఆయనకే దక్కాయి.
సత్వీర్ కౌర్ నేపథ్యం ఇదీ
పంజాబ్‌కు చెందిన సత్వీర్ కౌర్ 2024లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె తల్లిదండ్రులు సౌతాంప్టన్‌లో ఒక వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తుంటారు. సత్వీర్ కౌర్ గతంలో కేబినెట్‌లో పార్లమెంట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత కొంతకాలం మాతృత్వ సెలవులపై వెళ్లిన ఆమె ఇటీవలే మళ్లీ తన విధుల్లో నిమగ్నమయ్యారు.
హర్‌ప్రీత్ ఉప్పల్
హడ్డర్స్‌ఫీల్డ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్‌ప్రీత్ 2024లో ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం హర్‌ప్రీత్‌కు అసిస్టెంట్ విప్ బాధ్యతలు అప్పగించింది. పార్లమెంటులో పార్టీ ఎంపీల కార్యకలాపాలను ఆమె పర్యవేక్షించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
హెచ్-1బి వీసాలపై అమెరికా సెనేట్‌లో సంచలన బిల్లు.. మూడేళ్లపాటు పూర్తి విరామం?
చర్చల విషయంలో ఇరాన్ సానుకూలంగా ఉంది.. సీరియస్‌గా మట్లాడుతున్నారు: ట్రంప్