జైలు నుంచి సోనమ్ వాంగ్‌చుక్ విడుదల
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:57 AM
లడఖ్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన నిర్బంధాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో...
జోధ్‌పూర్/న్యూఢిల్లీ/లేహ్, మార్చి 14: లడఖ్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన నిర్బంధాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాదాపు ఆర్నెల్ల తర్వాత జోధ్‌పూర్ జైలు నుంచి బయటికొచ్చారు. లడఖ్‌కు రాష్ట్ర హోదాతో పాటు రాజ్యాంగాన్ని కాపాడాలంటూ గతేడాది సెప్టెంబరులో లేహ్‌లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.. ఈ అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పోలీసులు సహా 50 మంది గాయపడ్డారు. అయితే వాంగ్‌చుక్ పిలుపుతోనే ఈ ఆందోళనలు జరిగాయంటూ ఆయన్ను జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎ్‌సఏ) కింద అరెస్టు చేసి జోధ్‌పూర్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే భర్త వాంగ్‌చుక్ నిర్బంధాన్ని గీతాంజలి ఆగ్మో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆమె పిటిషన్‌పై వాదనలు సాగుతున్న తరుణంలోనే వాంగ్‌చుక్ నిర్బంధంపై కేంద్రాన్ని కోర్టు మందలించింది. ఇదే క్రమంలో వాంగ్‌చుక్ నిర్బంధాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తాజాగా ప్రకటించింది. వాంగ్‌చుక్ నిర్బంధాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అన్నారు. అయితే లడఖ్‌లో ఆందోళనలు, హింసకు తావులేదని.. ప్రజల ఆకాంక్షలను చర్చల ద్వారా నెరవేరుస్తామని చెప్పారు. కాగా, కల్పిత ఆరోపణలతో ఆధారాలు లేకుండా వ్యక్తులను నెలల తరబడి మోదీ సర్కారు ఎలా జైల్లో ఉంచుతుందో వాంగ్‌చుక్ కేసు మరోసారి బట్టబయలు చేసిందని ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. మోదీ సర్కారు మళ్లీ దొరికిపోయిందని ఎద్దేవా చేశారు. ‘జాతికి తన జీవితాన్ని అంకితం చేసిన శాస్త్రవేత్త వాంగ్‌చుక్.. ఆయన నిర్బంధం వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు. దేశానికే నష్టం. ఇప్పటికైనా బీజేపీ సర్కారు నిరంకుశత్వానికి బుద్ధి చెబుదాం’ అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే