వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష కేంద్రంపై పెరుగుతున్న నిరసన
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:30 AM
నీట్ తదితర పరీక్షల లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష...
వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష
కేంద్రంపై పెరుగుతున్న నిరసన
ఆలయాల్లో సొమ్ము దోచుకునేవాళ్లకు సత్యాగ్రహం విలువ అర్థం కాదు
వాంగ్‌చుక్! మీరు దేశానికి, ప్రపంచానికి
అవసరం.. దీక్ష విరమించండి: అఖిలేశ్
న్యూఢిల్లీ, జూలై 14: నీట్ తదితర పరీక్షల లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష మంగళవారానికి 17వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులు గడిచినా కేంద్రప్రభుత్వం స్పందించకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ, చివరికి బ్రిటీష్ ప్రభుత్వం కూడా ప్రజా డిమాండ్లపై జరిగే ఉద్యమం పట్ల ఇంత నిర్లక్ష్యం చూపలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ రాజకీయపార్టీల అధినేతలు.. దీక్షను విరవించుకోవాలని వాంగ్‌చుక్‌కు విజ్ఞప్తి చేశారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎక్స్‌లో ఈ మేరకు ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘ఆలయాల్లో సొమ్మును కూడా దోచుకునేవాళ్లకు సత్యాగ్రహం ప్రాధాన్యం ఏం అర్థమవుతుంది? ఈ దేశ యువత భవిష్యత్తు పట్లగానీ, ఆ యువతీ యువకుల తల్లిదండ్రుల కలల పట్లగానీ ఎటువంటి ఆసక్తి, సానుభూతి లేని వాళ్లు. స్వార్థం తప్ప మరొకటి తెలియని వ్యక్తులు. ఏ సిద్ధాంతమూ లేని, అవినీతి మకిలిపట్టిన ప్రభుత్వాన్ని ఆమరణదీక్షతో నిద్ర లేపటం సాధ్యం కాదు. అహంకారం మూర్తీభవించిన బీజేపీ నేతలు.. డబ్బుకు తప్ప మానవ జీవితాలకు విలువ ఇవ్వరు. బీజేపీని, దానికి అండగా నిలిచే అండర్‌గ్రౌండ్, అన్‌రిజిస్టర్డ్ ముఠాను శాశ్వతంగా ఓడించటానికి దేశ యువతకు మీరు దీపస్తంభంలా నిలవాలి. కాబట్టి, దీక్షను విరమించండి’ అని విజ్ఞప్తి చేశారు. మానవత పట్ల, పర్యావరణం పట్ల అంతులేని అంకితభావంతో ఉండే సోనమ్ వాంగ్‌చుక్ జీవితం అమూల్యమైనదని, మన దేశానికే కాదు ప్రపంచానికే ఆయన అవసరం ఉందని అఖిలేశ్ పేర్కొన్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో.. భారతదేశానికి సోనమ్ వాంగ్‌చుక్ ఒక సంపద లాంటి వ్యక్తి అని, ఆరోగ్యం విషమిస్తున్న దృష్ట్యా దీక్షను విరమించాలని పేర్కొన్నారు. పోరాటానికి ఇతర రూపాలు కూడా ఉన్నాయని, ఆ మార్గాల్లో ముందుకెళ్లాలని సూచించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు ఫోన్ చేసి వాంగ్‌చుక్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై సీపీఎం కేంద్రకమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఉమ్మడి కార్యాచరణను చేపట్టాలని పిలుపునిచ్చింది.
దీక్ష విరమణకు వాంగ్‌చుక్ ససేమిరా
‘భారతదేశ విద్యార్థులు, యువత కోసం మీరు దృఢనిశ్చయంతో, ధైర్యంతో చేస్తున్న ఈ పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాం. ఈ పోరాటం సుదీర్ఘమైనది.. ఇక్కడితో ఆగేది కాదు. మీ శక్తిసామర్థ్యాలు, మీ నాయకత్వం భవిష్యత్తులో అవసరం. ఇప్పటికే బలహీనంగా ఉన్న మీ ఆరోగ్యాన్ని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మరింత ప్రమాదంలోకి నెడుతోంది. కాబట్టి, నిరాహారదీక్షను విరమించండి’ అంటూ ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌షా, అరుంధతీరాయ్, జయతీఘోష్, నివేదితా మీనన్, ఆదిత్య నిగమ్, లలితారాందాస్ తదితరులు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సీనియర్ నటి జీనత్ అమన్ ‘దేశంలోని అత్యున్నత మేధావి ఒకరు ప్రాణత్యాగం చేస్తుంటే చూస్తూ కూర్చునే స్థాయికి మన సమాజం దిగజారొద్దు. ప్రభుత్వం తక్షణం చర్చలు ప్రారంభించాలి’ అని డిమాండ్ చేశారు. దీక్షను విరమించాలని తాము ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా వాంగ్‌చుక్ అంగీకరించటం లేదని అభిజిత్ దీప్కే తెలిపారు. ‘దీక్ష ఆపాలని నన్ను అడగొద్దు. కనీసం చర్చకు ఎందుకు ముందుకు రావటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి’ అని చెబుతున్నారని వెల్లడించారు. వాంగ్‌చుక్ కండరాల శక్తిని కోల్పోతున్నారని, విపరీతమైన బాధను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుగుబాటు ఎంపీలకు శివసేన ( (UBT) లీగల్ నోటీసులు
రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!