Share News

క్షీణిస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆరోగ్యం

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:58 AM

తన డిమాండ్లపై ప్రభుత్వం దిగొచ్చే వరకు నిరవధిక నిరాహార దీక్షను విరమించేది లేదని ప్రముఖ పర్యావరణ, సామాజిక ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ తేల్చిచెప్పారు....

క్షీణిస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆరోగ్యం

  • హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన వైద్య బృందం

  • ప్రభుత్వం దిగొచ్చే దాకా దీక్ష విరమించేది లేదు

  • విరమిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి

  • ఆపాలనే సలహాలొద్దు.. 20న పార్లమెంట్‌ మార్చ్‌లో

  • పాల్గొనండి.. మద్దతుదారులకు వాంగ్‌చుక్‌ పిలుపు

  • ఆయన ఆరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోండి: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ, జూలై 16: తన డిమాండ్లపై ప్రభుత్వం దిగొచ్చే వరకు నిరవధిక నిరాహార దీక్షను విరమించేది లేదని ప్రముఖ పర్యావరణ, సామాజిక ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ తేల్చిచెప్పారు. నీట్‌ పరీక్షా పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని, పారదర్శకమైన పరీక్షల దిశగా సంస్కరణలు తీసుకురావాలన్న డిమాండ్లతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆయన చేపట్టిన దీక్ష గురువారం 19వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ వాంగ్‌చుక్‌ తన ఉక్కు సంకల్పాన్ని వీడడం లేదు. ‘‘దీక్షను ఈ దశలో విరమిస్తే తప్పుడు సంకేతం పంపినట్టు అవుతుంది? పరీక్షా పత్రాల లీకేజీకి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి చెప్పినట్టు అవుతుంది’’అని పేర్కొన్నారు. దీక్ష విరమించాలని తనను కోరడానికి బదులు.. ఈ నెల 20న కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టబోయే పార్లమెంట్‌ మార్చ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పాఠశాల, కళాశాలల విద్యార్థులకు వాంగ్‌చుక్‌ పిలుపునిచ్చారు. కాగా, వాంగ్‌చుక్‌ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘‘ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనది. దానిని కాపాడటానికి ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాల ప్రయత్నాలు చేయాలి’’అని చీఫ్‌ జస్టిస్‌ డీకే ఉపాధ్యాయ, జస్టిస్‌ తేజాస్‌ కరియాతో కూడిన ధర్మాసనం అధికారులను ఆదేశించింది. వాంగ్‌చుక్‌ తన దీక్షను ఇలాగే కొనసాగిస్తే ఒకటికి మించిన అవయవాల పనితీరు దెబ్బతినొచ్చని, ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్‌ సతీష్‌ లాంబా ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఆహారం తీసుకోకపోవడం రెండో దశలోకి ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రవేశించినట్టు తెలిపారు. ఈ దశలో కండరాలు విచ్ఛిన్నమై, రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు పెరిగిపోతాయని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 05:58 AM