Share News

వాంగ్‌చుక్‌ దీక్ష.. ఉద్యమానికి ఊపిరి

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:56 AM

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు దారితీసింది. శనివారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు...

వాంగ్‌చుక్‌ దీక్ష.. ఉద్యమానికి ఊపిరి

న్యూఢిల్లీ, జూలై 25: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు దారితీసింది. శనివారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ చరిత్రాత్మక విజయం వెనుక ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ సాగించిన అలుపెరగని పోరాటం, దీక్ష అత్యంత కీలక పాత్ర పోషించాయి. దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమానికి ఊపిరిలూదిన ఆయన 26 రోజుల నిరాహార దీక్ష కేంద్ర ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసింది. నీట్‌ పరీక్షల అక్రమాలపై జూన్‌ 6న సీజేపీ నిరసనలు చేపట్టింది. ఈ నిరసనలకు మద్దతుగా సోనమ్‌ వాంగ్‌చుక్‌ జూన్‌ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈక్రమంలో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దాదాపు 10 కేజీల వరకు బరువు తగ్గారు. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన ప్రభుత్వం పోలీసులతో ఆయనను బలవంతంగా ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రి బెడ్‌పై నుంచే పార్లమెంట్‌ మార్చ్‌లో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు ఈనెల 20న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్దకు వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. ఇలా ఆయన 26 రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ నిరసనలో వాంగ్‌చుక్‌ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. నిరసన తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు స్వయంగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. నీట్‌ లీకేజీపై పార్లమెంట్‌లో చర్చ, నిరసన తెలిపిన విద్యార్థులపై కేసులు ఎత్తివేత, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటంబాలకు పరిహారం ఇస్తామని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఆయన గురువారం రాత్రి దీక్ష విరమించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అనంతరం జరిగిన కీలక పరిణామాలతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు.


ప్రజాస్వామ్యం సాధించిన విజయం: వాంగ్‌చుక్‌

ప్రభుత్వం స్పందించిన తీరును, విద్యాశాఖ మంత్రి రాజీనామాను ప్రజాస్వామ్య విజయంగా వాంగ్‌చుక్‌ అభివర్ణించారు. ఎక్స్‌ వేదికగా విక్టరీ సింబల్‌ చూపుతున్న తన ఫొటోను పంచుకుంటూ ఆయన స్పందించారు. ‘‘ప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం. ఈ అంశాన్ని లేవనెత్తిన సీజేపీ కార్యకర్తలకు, రాత్రింబవళ్లు మద్దతుగా నిలిచిన విద్యార్థులకు, యువతకు నా అభినందనలు. ఆద్యంతం క్రమశిక్షణతో, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మీరు పోరాడిన తీరు ప్రశంసనీయం. భవిష్యత్తులో కూడా మనం ఇదే శాంతియుత మార్గాన్ని ఎంచుకోవాలి. కేవలం ఒకరి రాజీనామాతో దేశం లేదా విద్యావ్యవస్థ రూపుదిద్దుకోదు. విద్యాశాఖలో పారదర్శకత, సంస్కరణలు రావాలి. ప్రభుత్వం చూపిన ఈ ఉదారత కేవలం నిర్ణయాలకే పరిమితం కాకుండా పాలనలో ప్రతిబింబించాలి. దేశం భయం, అన్యాయంతో కాకుండా ప్రేమ, అనురాగంతో పాటు సత్యం మార్గంలో నడవాలి’’ అని వాంగ్‌చుక్‌ పేర్కొన్నారు.

జెన్‌జీ నిజమైన విశ్వగురువు: వాంగ్‌చుక్‌ భార్య గీతాంజలి

భారతదేశం విశ్వగురువుగా మారడం అంటే ఏమిటో ఎవరైనా నిరూపించారు అంటే, అది మన జెన్‌జీ యువతేనని వాంగ్‌చుక్‌ భార్య గీతాంజలి ఆంగ్మో పేర్కొన్నారు. వారు సనాతన ధర్మాన్ని కేవలం ప్రచారం చేయలేదని, నిజంగా జీవించి చూపించారని తెలిపారు. ప్రపంచంలో ఇటీవల జరిగిన అనేక విద్యార్థి ఉద్యమాలతో భారత యువతను పోలుస్తూ, మన విద్యార్థులు ద్వేషం లేకుండా ధైర్యాన్ని, హింస లేకుండా శక్తిని, అంధభక్తి లేని నిజమైన దేశభక్తిని చాటారని కొనియాడారు. నేపాల్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో జెన్‌జీ నిరసనలు తీవ్ర రక్తపాతానికి, ప్రభుత్వాల కూల్చివేతకు దారితీసిన విషయాన్ని గుర్తుచేస్తూ, సొంత దేశాన్ని తగటబెట్టకుండా కూడా అన్యాయాన్ని ఎదిరించవచ్చని భారతీయ యువత నిరూపించిందని ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా స్పందించిన గీతాంజలి, బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 05:56 AM